Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుక్రవారం వైరల్ కామెంట్స్ చేశారు. చట్టసభల్లో ఏమాత్రం అనుభవం లేకపోయినా, తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రి పదవి దక్కడం ఎలా అనిపిస్తోంది? అనే ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
రేఖా గుప్తా మాట్లాడుతూ, అత్యున్నత పదవి పొందినప్పుడు బాలీవుడ్ సినిమా నాయక్ లోని హీరోయిన్ లాగా ఫీలయ్యానని తెలిపారు. ఈ సందర్భంగా ఉర్దూ కవి రహత్ ఇందోరి రాసిన కవితను ప్రస్తావిస్తూ, “నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకుల్లో ఒకటి కాదు. ఎవరైనా ఆ తుఫానుకు చెప్పండి, తనను తన అదుపులో ఉంచుకోవాలని” అంటూ పేర్కొన్నారు.
అలాగే, ఢిల్లీకి సీఎం కావాలనేది తన కల కాదని, తన పని తాను చేసుకుంటూ వచ్చానని అన్నారు. ఈ పదవి తనకు లాటరీలా రాలేదని, మహిళలపై గౌరవంతోనే తనను సీఎం పదవికి ఎంపిక చేశారని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
రేఖా గుప్తా రాజకీయ ప్రయాణం
రేఖా గుప్తా తొలిసారి శాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దాంతో, బీజేపీ హైకమాండ్ చట్టసభల్లో అనుభవం లేని రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.

