Reharsals For Bomb Blasts: దేశంలో మరోసారి ఉగ్ర కుట్రను భారత దర్యాప్తు సంస్థలు సమయోచితంగా గుర్తించి భగ్నం చేశాయి. రెండు రాష్ట్రాలకు చెందిన యువకులు భారత్‌లో బాంబు పేలుళ్లకు రెడీ అవుతుండగా, వారి పథకాన్ని సర్వేలన్స్, ఇంటెలిజెన్స్ ఆధారంగా చెడగొట్టారు. ఇందులో విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ (29), సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ (28) అనే ఇద్దరు యువకులు ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు నిర్ధారణ అయింది.
‘అహిం’ పేరిట ఉగ్ర సంస్థ ఏర్పాటు
ఈ ఇద్దరూ ‘అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (AHIM)’ అనే పేరుతో ఓ ఉగ్ర సంస్థను నిర్మించుకుని, భారత శాంతిభద్రతలను ధ్వంసం చేయాలనే దుష్ప్రయత్నంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇందులో సిరాజ్ ప్రధానంగా వ్యవహరించగా, సమీర్ అతని మద్దతుదారుగా వ్యవహరించాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా సౌదీ అరేబియాకు చెందిన గుర్తుతెలియని హ్యాండ్లర్ వీరికి మార్గదర్శకత్వం అందించినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
ఆన్లైన్ ద్వారా బాంబు పదార్థాలు – రిహార్సల్స్ ప్లాన్
పొటాషియం క్లోరేట్, సల్ఫర్ వంటి పేలుడు పదార్థాలను ఆన్లైన్లో కొనుగోలు చేసి, వాటి వాడుకపై యూట్యూబ్, ఫోరమ్‌ల ద్వారా అవగాహన పెంచుకున్నారు. ఈనెల 21 లేదా 22న విజయనగరం పరిసరాల్లో బాంబు పేలుళ్లకు ట్రయల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 12వ తేదీన సిరాజ్ విజయనగరంలో బాంబును ప్రయోగాత్మకంగా పరీక్షించాడు.
ఇది కూడా చదవండి: PM Kisan 20th Installment: రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో పీఎం కిసాన్ నిధులు
గ్రూప్-2 పేరుతో కుట్రా?
సిరాజ్ గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతానని చెప్పి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడే సమీర్‌తో కలిసి పలుమార్లు సమావేశమయ్యాడు. ఈ సమయంలోనే ఉగ్ర కార్యాచరణలకు రూపకల్పన జరిగింది. సిరాజ్ తిరిగి విజయనగరానికి వెళ్లి తన చిరునామాకు పేలుడు పదార్థాలను తెప్పించుకున్నాడు.
28 మందితో గుంపు – మైనర్లతోనూ కాంటాక్ట్
ఈ ఇద్దరూ మైనర్లతో సహా మరో 28 మందిని తమ గ్రూపులో చేర్చుకున్నట్టు తెలిసింది. హ్యాండ్లర్ వీరిని ‘మ్యాజిక్ లాంతర్’ అనే ప్రక్రియ ద్వారా ఎంపిక చేశాడు. అంటే, సోషల్‌మీడియాలో ఉగ్రవాద అనుకూలంగా స్పందించిన వారిని టార్గెట్ చేసి, వారితో సంప్రదింపులు జరిపే తంతు ఇది.
ఇంటెలిజెన్స్ నిఘా ఫలితం
వీరిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ శాఖ ముద్ర వేసి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. శనివారం విజయనగరంలో సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో సమీర్‌ను సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకుని విజయనగరానికి తరలించారు.
NIA దృష్టి – కేసు మరింత లోతుగా
ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దృష్టి సారించింది. ప్రస్తుతం విజయనగరం టూటౌన్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే సౌదీ హ్యాండ్లర్ ఎవరో ఇంకా తేలలేదు. ఐతే, అతడు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫైళ్లను పంపించి, అగ్గిపుల్లల్లోని మందును ఎలా వినియోగించాలో సూచించినట్టు విచారణలో వెల్లడైంది.
నిందితులకు 14 రోజుల రిమాండ్ – తండ్రి ఆశలు భగ్నం
సిరాజ్ తండ్రి ఏఎస్సై, సోదరుడు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తన కుమారుడిని పోలీస్ ఆఫీసర్‌గా చూడాలన్న తండ్రి కల ఈ సంఘటనతో తుడిచిపెట్టుకుపోయింది. ఉగ్రవాద మార్గంలోకి వెళ్లిన సిరాజ్, సమీర్‌లకు విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

