Heavy Rains: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్‌బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడటం, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్ వంటి వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ముంబై, పుణే, నాందేడ్ నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. నాందేడ్‌లో క్లౌడ్‌బరస్ట్ వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించి, రాబోయే 48 గంటలు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ముంబైలో రోడ్లు నదులను తలపిస్తున్నాయి
ముంబైలో గత 84 గంటల్లో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని రోడ్లు ప్రాజెక్టు కాలువలను తలపిస్తున్నాయి. చాలా చోట్ల కార్లు నీట మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో నడుం లోతు నీటిలో ప్రయాణికులు అతి కష్టం మీద ముందుకు సాగుతున్నారు. లోకల్ రైళ్లు నడుస్తున్నప్పటికీ, స్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రోడ్లపై రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ముంబై, థానే, పాల్ఘర్లకు వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది.
విమాన రాకపోకలకు అంతరాయం
ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 155 విమానాలు, అక్కడికి చేరుకోవాల్సిన 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాశ్రయానికి వెళ్లే దారులన్నీ నీట మునగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాల మధ్య విమానాశ్రయ టెర్మినల్ T1 దగ్గర ఒక బస్సులో అగ్నిప్రమాదం జరగగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే అదుపు చేశారు.
ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి
ముంబైలోని పోవాయ్ సమీపంలో వరదల్లో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. థానేలోని అండర్‌పాస్‌లో మునిగిన కారులో ఉన్న ఇద్దరిని స్థానికులు కాపాడారు. కొంకణ్ ప్రాంతం కూడా వరదలతో వణికిపోతోంది. రత్నగిరి జిల్లాలో జగ్బుడి, వశిష్టి, శాస్త్రి, కజలి, బవ్నాది, కొడవలి వంటి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఖేడ్, చిప్లున్, సంగమేశ్వర్, రాజపూర్ వంటి నగరాల్లోకి వరద నీరు చేరి ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి.
Also Read: Tamil Nadu: విద్యుత్ బోర్డుకు కొత్త అప్పుల విధానం బాండ్ల జారీ ద్వారా నిధుల సేకరణ
ప్రభుత్వ హెచ్చరికలు
ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సూచించారు. సముద్రంలో 3.75 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున మెరైన్ డ్రైవ్, గేట్‌వే ఆఫ్ ఇండియా వంటి తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. థానేలో వరద ప్రభావిత ప్రాంతాలను డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే పర్యటించి, బాధితులను పరామర్శించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

