Ramachandra Rao: తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన పొత్తుల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు క్లారిటీ ఇచ్చారు. ఈసారి కూడా తమ పార్టీ ఎటువంటి పొత్తులు లేకుండా స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు.
“స్థానిక సంస్థలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది,” అని రామచందర్ రావు స్పష్టం చేశారు. ఏ ఇతర పార్టీలతోనూ పొత్తుల విషయంలో బీజేపీ ఆలోచించడం లేదని చెప్పారు.
ఇక ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో విద్యార్థులకు తగిన పోషకాహారం అందడం లేదని ఆరోపిస్తూ, కలుషిత ఆహార ఘటనలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా కలసి పనిచేస్తున్న నేపథ్యంలో, ఇలాంటి పొత్తులు తెలంగాణలోనూ చోటు చేసుకోనున్నాయన్న ఊహాగానాలు వచ్చాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మూడు పార్టీల పొత్తు గురించి చర్చ సాగుతుండగా, రామచందర్ రావు తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడినట్టయ్యింది.