Rakhi 2025: రక్షాబంధన్ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అయితే, ఈసారి ఈ పండుగను దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సైనికులకు అంకితం చేశారు సికింద్రాబాద్‌లోని క్రాంతి పార్క్ రాయల్ రెసిడెంట్స్. ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న వీర జవాన్లకు రాఖీ కట్టి, వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం దేశభక్తిని చాటి చెప్పేలా ఆకట్టుకుంది.
జై జవాన్ నినాదాలతో హోరెత్తిన వాతావరణం
క్రాంతి పార్క్ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో మేజర్ రాజ్ ప్రసాద్ మరియు ఆయన సహచర సైనికాధికారులకు స్థానిక మహిళలు రాఖీలు కట్టారు. తమకు రక్షగా ఉన్న సైనికులకు తోడుగా తాముంటామని వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్‌లోని త్రివేణి స్కూల్ విద్యార్థులు కూడా పాల్గొని, జవాన్లకు వీర తిలకం దిద్ది, రాఖీలు కట్టారు. “దేశం కోసం మీరుంటే, మీ కోసం మేమున్నాం” అనే నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. రక్షాబంధన్ సందర్భంగా మేజర్ రాజ్ ప్రసాద్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
‘పౌరుల మద్దతే మాకు బలం’ – మేజర్ రాజ్ ప్రసాద్
ఈ సందర్భంగా మేజర్ రాజ్ ప్రసాద్ మాట్లాడుతూ, క్రాంతి పార్క్ నివాసితులు చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. యువతలో దేశభక్తిని ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. దేశం శత్రు దుర్భేద్యమని, పౌరులంతా తమకు అండగా ఉన్నారన్న భావనే సైనికులకు మరింత ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. సైనికులకు రాఖీ కట్టడం తమను మానసికంగా మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
ఆపరేషన్ సింధూర్ మన సత్తాను చాటింది – ఎస్వీ జగపతి వర్మ
క్రాంతి పార్క్ రాయల్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్వీ జగపతి వర్మ మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. గతంలో మన దేశాన్ని చిన్నచూపు చూసిన దేశాలు ఇప్పుడు మన సైనిక బలానికి తలవంచుతున్నాయని చెప్పారు. శాంతి మార్గంలో నడిచే భారత్‌పై దాడికి ప్రయత్నిస్తే తిరుగులేని సమాధానం ఇస్తామని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న త్రివేణి స్కూల్ విద్యార్థులకు, నివాసితులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సైనికాధికారులు విద్యార్థులకు భారత సైనిక విజయాలు, ఆపరేషన్ సింధూర్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్రాంతి పార్క్ రెసిడెంట్స్ తరఫున రామ్మోహన్, టి. రాంబాబు, వి. రవికుమార్, త్రివేణి స్కూల్ నుంచి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

