Raja Singh: తెలంగాణలో త్వరలో కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరుగుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అయితే ఈ కొత్త అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? రాష్ట్ర కమిటీనా లేక జాతీయ కమిటీనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంపుగా మిగిలిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంటేనే అది సరైన దిశగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
గతంలో ఒక అధ్యక్షుడు తన సొంత గ్రూపును ఏర్పరుచుకుని పార్టీకి నష్టం చేశారని ఆయన విమర్శించారు. కొత్త అధ్యక్షుడు కూడా అదే విధంగా గ్రూపిజానికి దిగితే పార్టీకి మళ్లీ నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ప్రస్తుతం బీజేపీలో మంచి నాయకులు ఉన్నప్పటికీ, వారి చేతులను కట్టిపడేస్తున్నారని ఆయన విమర్శించారు. సీనియర్ నాయకులకు స్వేచ్ఛ ఇవ్వాలంటే, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కొత్త పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రితో రహస్య చర్చలు చేయకుండా ఉండాలని రాజాసింగ్ సూచించారు. తన వ్యాఖ్యలు సీనియర్ నేతలు, కార్యకర్తల మనసులోని మాటలే అని అన్నారు. పార్టీ నేతలకు సమస్యలు చెప్పాలే తప్ప, మీడియా ముందుకు వెళ్లొద్దని కొందరు చెబుతున్నారని, కానీ తమ సమస్యలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే మీడియా ముందు రావాల్సి వచ్చిందని వివరించారు.
సీనియర్ నేతలను బీజేపీ గుర్తించడంలో విఫలమవుతోందని రాజాసింగ్ విమర్శించారు. నామినేటెడ్ పోస్టులను సీనియర్ నేతలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. పార్టీలో సీనియర్ నాయకులకు సరైన గౌరవం కల్పించకపోతే, పార్టీకే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని ఆయన హెచ్చరించారు.