Kamareddy: కామారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి కుంభవృష్టి కురిసింది. రాజంపేట మండలంలో అత్యధికంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతింది. కామారెడ్డి – నిజామాబాద్ మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో హైదరాబాద్ – నిజామాబాద్ రైలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలో నీటిమునిగిపోయింది. వందలాది ఇళ్లు వరద నీటితో చుట్టుముట్టాయి. రోడ్లపై నీరు ఉధృతంగా చేరడంతో పలు కార్లు, రెండు చక్రాల వాహనాలు కొట్టుకుపోయాయి. గోడలు కూలిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ప్రజలను ఆందోళనకు గురి చేశాయి.
స్థితి తీవ్రంగా ఉండటంతో ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.