హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.హర్యానాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియపై తమకు అందిన ఫిర్యాదుల గురించి ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామన్నారు.
‘హర్యానాలో అనూహ్య ఫలితాలపై మేం విశ్లేషణ చేస్తున్నాం. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి గురించి ఎన్నికల సంఘానికి తెలియజేస్తాం. హర్యానాలో పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించిన కార్యకర్తలు, నేతలు.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది’ అని రాహుల్ పేర్కొన్నారు.
ఫలితాల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 చోట్ల కమలం పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసీ పనితీరుతోపాటు ఈవీఎంలపైనా ఆరోపణలు చేస్తున్నారు.
జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఎన్‌సీ – కాంగ్రెస్ కూటమి 49 స్థానాల్లో జయకేతం ఎగురవేసింది. ఇందులో ఎన్‌సీ అత్యధికంగా 42 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 6, సీపీఎం 1 సీటును గెలుచుకుంది. బీజేపీ 29 సీట్లతో సరిపెట్టుకుంది.

