Minister Nimmala: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పనుల వేగంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, కొన్ని ముఖ్యమైన విషయాలను మీడియాకు వెల్లడించారు. 2027 చివరినాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడుసార్లు పోలవరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించారని మంత్రి తెలిపారు. పనులు షెడ్యూల్ ప్రకారం వేగంగా జరుగుతున్నాయని, ముఖ్యంగా డీ-వాల్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలంలో కూడా పనులు ఆటంకం లేకుండా జరిగేలా బట్రస్ డ్యామ్ పనులు దాదాపు పూర్తయ్యాయని మంత్రి వివరించారు.
ప్రస్తుతం పోలవరం హెడ్ వర్క్స్ 80 శాతానికి పైగా పూర్తయ్యాయని నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతుంటే కొంతమంది ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. డీ-వాల్ నిర్మాణం విషయంలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మీడియా సమక్షంలోనే బావర్ కంపెనీ ప్రతినిధులు డీ-వాల్ ప్యానల్ వెడల్పు 1.5 మీటర్లు ఉందని కొలిచి చూపించారని, దీనిపై ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు.
Also Read: Vidya Mitra Kits 2025: ఏపీలో జూన్ 12వ తేదీ నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్’లు పంపిణీ..!
Minister Nimmala: ప్రపంచంలోనే డీ-వాల్ నిర్మాణంలో నిపుణులైన జర్మనీకి చెందిన బావర్ కంపెనీతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ పనులు చేయిస్తుంటే, దీనిపై కూడా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ మంత్రులు పోలవరం ప్రాజెక్టు తమకు అర్థం కాలేదని, ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని అన్నారని గుర్తు చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పనులను వేగవంతం చేసి చూపిస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు.