Danam nagendar: కాంగ్రెస్ పార్టీలో పదవులు కోరేవారు కేవలం హామీలపై ఆధారపడకుండా, నిబద్ధతతో కృషి చేస్తేనే సరైన గుర్తింపు పొందగలరని ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు.
మంగళవారం దానం నాగేందర్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిమాయత్‌నగర్‌లో రూ. 60 లక్షల అంచనా వ్యయంతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత, ఆదర్శ్ నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో 150 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారని దానం నాగేందర్ వివరించారు. “గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎస్సీ, బీసీ వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆశయాలను, ఆలోచనలను రేవంత్ రెడ్డి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎవరికైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, “ఇంకా సమయం ఉంది, అందరూ వేచి చూడాలి” అని దానం సూచించారు. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.