Peddi Trailer: మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమా అఫీషియల్ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో చిత్ర యూనిట్ భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఈ ట్రైలర్లో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని విధంగా రెండు భిన్నమైన గెటప్స్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ కథలో చరణ్ నటన అద్భుతంగా ఉంది. ఒకవైపు పల్లెటూరి క్రికెటర్‌గా కనిపిస్తూనే, మరోవైపు రగ్గడ్ లుక్‌లో భారీ కాయంతో ‘పెద్ది పహిల్వాన్’గా ఆయన చూపించిన వేరియేషన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. చరణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఊరమాస్ ఎలివేషన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్‌లోని ప్రతి సీన్‌ను ఆయన తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. విజువల్స్, ఎమోషన్స్, మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించి సినిమాపై హైప్‌ను తారాస్థాయికి చేర్చాయి.
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పాన్-ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
