Heatwave Alert

Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!

Heatwave Alert: ఈ నెల 26నే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయన్న వార్తలతో.. ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశపడ్డ తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. అసలైన ఎండాకాలం ఇప్పుడే మొదలుకాబోతోందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఎండ తీవ్రతతో పాటు వడగాలులు, ఉక్కపోత జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఉదయం ఎండ కాసి, సాయంత్రానికి వర్షాలు పడిన వాతావరణం మారిపోయి, ఇకపై పూర్తిగా భానుడు ప్రతాపం చూపించనున్నాడు.

తెలంగాణలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ప్రజలంతా ఎండల పట్ల తీవ్ర అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవే వాతావరణ పరిస్థితులు తలపించనున్నాయి. ఏపీలో మంగళవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు వారం రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఏకంగా 45 డిగ్రీలు దాటవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 21 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పెరుగుతున్న వేడి, వడగాలుల దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

అయితే, మరోవైపు విదర్భ నుండి కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా ఉపశమనం కూడా కలగనుంది. దీని ప్రభావంతో ఇవాళ ఏపీలోని మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏదేమైనా రాబోయే వారం రోజులు మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిప్పుల కొలిమిలా మారబోతోందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *