Vidya Mitra Kits 2025: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులు ముగిసిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి మొదలవబోతుంది. అదే రోజు నుంచి రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్’లు పంపిణీ చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యా శాఖ నుంచి వచ్చిన తాజా ఆదేశాల ప్రకారం, జూన్ 20లోపు ఈ పంపిణీ పూర్తయ్యేలా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
విద్యార్థి మిత్ర కిట్‌లో ఉండే వస్తువులు ఇవే:
— పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్
— నోట్‌బుక్స్
— 3 జతల యూనిఫామ్
— స్కూల్ బ్యాగ్
— బూట్లు, 2 జతల సాక్సులు
— బెల్ట్
— ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ (1వ తరగతికి పిక్టోరియల్ డిక్షనరీ)
ఈ సంవత్సరం విద్యార్థులకు యూనిఫామ్‌లు కొత్త రంగుల్లో అందించనున్నారు. బాలురకు ఆలీవ్ గ్రీన్ కలర్ ప్యాంట్లు, బాలికలకు ఆలీవ్ గ్రీన్ గౌన్లు, అలాగే లైట్ ఎల్లో-గ్రీన్ చారల చొక్కాలు ఇవ్వనున్నారు. 1 నుండి 8 తరగతి విద్యార్థులకు కుట్టుకూలి కింద రూ.120 చొప్పున, 9, 10 తరగతుల వారికి రూ.240 చెల్లించనున్నారు.
Also Read: Kishan Reddy: పేదల అభివృద్ధి.. సంక్షేమానికి DNA కట్టుబడి ఉంది
Vidya Mitra Kits 2025: ఈ విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35.94 లక్షల మంది విద్యార్థులకు మిత్ర కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.953.71 కోట్ల వ్యయాన్ని అంచనా వేసింది. ఒక్కో విద్యార్థి కిట్‌పై సగటుగా రూ.2,279 ఖర్చవుతుందని అధికారులు తెలిపారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు అయితే ఇప్పటికే జూన్ 1 నుంచే విద్యాసంవత్సరం ప్రారంభమైంది. వారికి అవసరమైన పుస్తకాలు, నోట్‌బుక్స్ ఇప్పటికే అందినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ చర్యలన్నింటి ద్వారా విద్యార్థులు స్కూల్‌కు వస్తున్న తొలి రోజునే అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా చూసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇది విద్యలో సమానత్వానికి, విద్యార్థుల మనోధైర్యానికి బలం చేకూర్చే దిశగా తీసుకున్న ముందడుగు.