PM Kisan: రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద 20వ విడత నిధులను రేపు, రేపు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు నేరుగా జమ కానుంది.
మోదీ చేతుల మీదుగా వారణాసిలో నిధుల విడుదల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసిలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.20,500 కోట్లను రైతులకు అందించనుంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమ ఏర్పాట్లను బుధవారం సమీక్షించారు.
ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయి కాబట్టి, మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ప్రతి అర్హత కలిగిన రైతుకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున వారి ఖాతాల్లోకి జమ చేయబడతాయి.
పీఎం కిసాన్ పథకం గురించి…
పీఎం కిసాన్ పథకం 2019 ఫిబ్రవరి 2న ప్రారంభమైంది. ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ నిధులు నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 19 వాయిదాలలో రూ.3.69 లక్షల కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. ఈ నిధులు రైతుల ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తూ, వారి వ్యవసాయ పనులకు చేదోడుగా ఉంటున్నాయి.