IPL 2025: ఐపీఎల్ మెగా వేలానికి ముందు క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూసిన ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది. 10 ఫ్రాంఛైజీలు కలిపి 46 మందిని రిటైన్ చేసుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ రూ. 23 కోట్లతో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్ గా నిలవగా .. రూ. 4 కోట్లతో స్టార్లలో తక్కవ ధర మహేంద్ర సింగ్ ధోనీది కావడం విశేషం. ఇక రిటైన్ చేసుకోని ప్లేయర్ల జాబితా చూస్తే.. స్టార్ ఆటగాళ్లు చాలా మంది కనిపిస్తున్నారు. మరికొందరు స్టార్లు తమంతట తాము వేలంలోకి వచ్చారు.
ఐపీఎల్ మెగా వేలంలో ఈసారి అనుకోని ఆశ్చర్యం.. కెప్టెన్లుగా వ్యవహరించిన ఇండియన్ ప్లేయర్లను సదరు ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోలేదు. ఇండియన్ ప్లేయర్లలో రిటైన్ కాని ఆటగాళ్లలో కెప్టెన్లుగా వ్యవహరించిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న రిషభ్ పంత్ విషయంలో వినిపించిన ఊహాగానాలే నిజమయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్‌లో పంత్ పేరు లేదు. ఈ లెక్కన చూస్తే పంత్‌కు మెగా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. కెప్టెన్సీ అనుభవం, వికెట్ కీపింగ్, దూకుడైన బ్యాటింగ్ చేయగల పంత్ హాట్ కేక్. ఇక, కేఎల్ రాహుల్‌ని లక్నో వదులుకుంది. రాహుల్‌కీ వేలంలో మంచి ధర పలికే ఛాన్స్ ఉంది. కెప్టెన్సీ అనుభవం, వికెట్ కీపింగ్, అతని అనుభవం రాహుల్ కు వేలంలో ప్లస్ పాయింట్స్ కానున్నాయి. గత సీజన్‌లో కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ను ఆ ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకోలేదు. దీంతో కెప్టెన్ అవసరమున్న ఫ్రాంచైజీలు అతనికోసం వెళ్లే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: IPL 2025 Retentions: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల..
IPL 2025: మరోవైపు ముండైకి చాలా ఏళ్లుగా వికెట్‌కీపర్‌గా ఉన్న ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టారు. ఇన్నాళ్లు జట్టులో ప్రధాన బౌలర్‌గా ఉన్న మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ వదులకోగా.. 2022లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ షమీని గుజరాత్ రిటైన్ చేసుకోలేదు. అతను గాయం నుంచి కోలుకోకపోవడంతో రిటైన్ చేసుకోలేదని తెలుస్తోంది. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న యుజీ చాహల్‌ను రాజస్థాన్ వదులుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుండగా.. గత సీజన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ అశుతోష్ శర్మను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోలేదు. కెప్టెన్ శిఖర్ ధావన్, ప్రధాన పేసర్ అర్ష్‌దీప్‌ను పంజాబ్ వదులుకుంది.
భారత స్టార్లే కాదు.. కొందరు విదేశీ స్టార్లను సైతం ఫ్రాంచైజీలు వేలంలోకి వదిలాయి. కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ అట్టిపెట్టుకోలేదు. కోహ్లీని రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. వచ్చే సీజన్‌లో కోహ్లీ మళ్లీ కెప్టెన్ అయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు స్టార్ ప్లేయర్లు విల్ జాక్స్, కామెరూన్ గ్రీన్‌ను కూడా బెంగళూరు వదులుకుంది. ఈ సీజన్‌లో నిరాశపరిచిన రచిన్ రవీంద్రను సీఎస్కే అట్టిపెట్టుకోలేదు. గాయం కారణంగా ఈ ఏడాది ఆడని డెవాన్ కాన్వేను కూడా చెన్నై వదులుకుంది.
ఇది కూడా చదవండి: IPL 2025 Purse Remaining: రిటెన్షన్ తర్వాత ఎవరి పర్సులో ఎంత?
IPL 2025: గత సీజన్‌కు ముందు మినీ వేలంలో రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటైన్ చేసుకోకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. క్రీజులో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడే క్వింటన్ డికాక్, మార్కస్ స్టాయినిస్‌లను లక్నో వదులుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. గత సీజన్‌లో ఆశించిన మేరకు రాణించలేకపోయిన టిమ్ డేవిడ్‌ను ముంబై వదులుకోగా.. ఇప్పటివరకు టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్ మరోసారి జట్టులో భారీ మార్పులకు పూనుకుంది. స్టార్ ప్లేయర్లు జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, కగిసో రబాడ, లివింగ్‌స్టోన్‌లలో ఒక్కరిని కూడా అట్టిపెట్టుకోలేదు. రాజస్థాన్ రాయల్స్ ట్రెంట్ బౌల్ట్, జోస్ బట్లర్‌ను రిటైన్ చేసుకోకుండా వదిలేయడం విస్మయం కలిగిస్తోంది.
ఇప్పుడు ఫ్రాంచైజీలన్నీ బైబ్యాక్ ఎవరిని చేయాలి.. వేలంలో ఎవరిని తీసుకోవాలి అన్న అంశాలపై కసరత్తులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. జట్టు బ్యాటింగ్, బౌలింగ్.. పటిష్టమైన బెంచ్ ఏర్పాటులో జట్ల కోచింగ్ స్టాఫ్ తలమునకలవుతున్నాయి. కాగా.. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ఒక్కో జట్టు ఒక్కొక్కరిని మెగా వేలంలో తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంది. మరి ఏ ఫ్రాంచైజీ ఎవరిని తీసుకుంటుంది అనేది ఈ నెల మూడో వారంలో జరగనున్న వేలంలో తేలనుంది. వ్యూహాత్మకంగా వదులుకున్న ప్లేయర్లను తిరిగి దక్కించుకోవడానికి టీమ్‌లు భారీ మొత్తంలో వెచ్చిస్తాయనే వార్తలూ వస్తున్నాయి. స్టార్ల ప్లేయర్లను దాదాపు అన్ని జట్లు వేలంలో వదిలేయడంతో ఈసారి మెగా వేలం అనంతరం అన్ని జట్లూ కొత్త ఆటగాళ్లతో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.