Nara Lokesh: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ ‘మహానాడు-2026’ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ అత్యంత కీలకమైన, చారిత్రాత్మక ప్రతిపాదన చేశారు. “మహానాడు అంటేనే ఒక మాస్ జాతర. ఎన్టీఆర్ గారు ఎప్పుడో మహిళల్లోని ‘స్త్రీ శక్తి’ని గుర్తించి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఇప్పుడు దాన్ని మరోస్థాయికి తీసుకెళ్తూ.. రాబోయే 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం అసెంబ్లీ/పార్లమెంట్ సీట్లు కేటాయించాలని నేను టీడీపీ నాయకత్వానికి ప్రతిపాదిస్తున్నాను. దేశంలో మహిళా బిల్లు పాస్ అయినా, కాకపోయినా.. టీడీపీలో ఇది కేవలం మా నినాదం కాదు, ఒక బలమైన నిర్ణయం. రాబోయేది మహిళా ఆధిపత్య స్వామ్యమే” అని లోకేష్ ప్రకటించారు.
ఈ డిజిటల్ మహానాడు సభలో ఆయన కార్యకర్తలను ఉత్సాహపరుస్తూనే.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శల తూటాలు పేల్చారు.
హైబ్రిడ్ మోడ్‌ను ఎగతాళి చేసిన ‘టీమ్ 11’కు స్ట్రాంగ్ కౌంటర్!
ఈసారి మహానాడును సరికొత్తగా టెక్నాలజీతో అనుసంధానిస్తూ హైబ్రిడ్ విధానంలో నిర్వహించడంపై లోకేష్ మాట్లాడారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపుతో, డిజిటల్ ఇండియా స్పూర్తితో ఈసారి మహానాడును హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహిస్తున్నాం. మేము ‘హైబ్రిడ్’ అనగానే అటువైపు ఉన్న ‘టీమ్ 11’ (వైసీపీ నేతలు) ఎగతాళి చేసింది. కానీ వారికి నేనొక్కటే చెబుతున్నా.. మారింది టెక్నాలజీ మాత్రమే, మీటింగ్ విధానమే కానీ కార్యకర్తల జోష్ కాదు. ముందు ముందు క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేసే పూర్తి బాధ్యత మాదే” అని లోకేష్ హెచ్చరించారు.
CBN బ్రాండ్ ఇమేజ్..
తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా.. వారి నోట వినిపించే ఏకైక మాట ‘CBN’. చంద్రబాబు నాయుడు గారితో 25 ఏళ్ల వయసున్న యువకులు ముగ్గురున్నారు (ఆయన విజన్ అంత యంగ్‌గా ఉంటుంది). ఇప్పటికే ఆయన జెడ్ (Z) స్పీడ్‌తో రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.
చంపేస్తున్నా పసుపు జెండా వదల్లేదు..
గత ఐదేళ్ల (2019-24) వైసీపీ పాలనలో టీడీపీ క్యాడర్ పడిన కష్టాలను లోకేష్ గుర్తుచేసుకున్నారు. టీడీపీలో కార్యకర్తలే అసలైన అధినేతలు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర లాంటి ఎంతోమంది సీనియర్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి భయపెట్టాలని చూశారు. ఎంతోమంది బీసీ, ఎస్టీ, మైనారిటీ సోదరులను చంపేశారు. మనపై వందలాది తప్పుడు కేసులు పెట్టి వేధించారు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ‘తగ్గేదేలే’ అని నిలబడ్డాం. చివరకు చంపేస్తున్నా మన కార్యకర్తలు పసుపు జెండాను వదల్లేదు. కేసులు పెడితే భయపడే చరిత్రే టీడీపీకి లేదు” అని ధ్వజమెత్తారు.
అఖండ మెజార్టీ..
ఆ పోరాటాల ఫలితంగానే, ప్రజలు మనపై ఉంచిన నమ్మకంతో 2024 ఎన్నికల్లో కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించారని, 8 ఉమ్మడి జిల్లాల్లో క్లీన్‌స్వీప్ ఇచ్చారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
మాది గూగుల్ హిస్టరీ.. మీది గొడ్డలి హిస్టరీ!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి లోకేష్ ఈ వేదికగా ఒక బహిరంగ సవాల్ విసిరారు. “జగన్‌కు ఇదే నా ఓపెన్ ఛాలెంజ్.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై, మేము చేస్తున్న సంక్షేమంపై నాతో చర్చకు మీరు సిద్ధమా? రాష్ట్రా దౌర్భాగ్యం ఏంటంటే.. నీది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన చరిత్ర.. నాది ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ (Stanford) యూనివర్సిటీలో చదివిన చరిత్ర. ‘మాది గూగుల్ హిస్టరీ.. మీది గొడ్డలి హిస్టరీ’. గొడ్డలి పార్టీ అంటే ఆ సైకోకు ఎందుకు అంత కోపం వస్తుంది? మీ సొంత బాబాయిని చంపింది గొడ్డలితోనే కదా? కన్నతల్లిని, తోబుట్టువైన చెల్లిని ఇల్లు దాటించి బయటకు గెంటేసింది మీరు కాదా?” అంటూ లోకేష్ నిలదీశారు.
ఆడబిడ్డల జోలికి వస్తే తోలు తీస్తాం!
‘నేషన్ ఫస్ట్’ (Nation First) అనేది తెలుగుదేశం పార్టీ ప్రధాన నినాదమన్న లోకేష్.. కాలానికి అనుగుణంగా పార్టీ సిద్ధాంతాల్లో మార్పులు చేసుకుంటూ ప్రజా పక్షాన నిలబడతామన్నారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందని, కాబట్టి వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న కుట్రలను నిరంతరం గమనిస్తూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ వల్లే సాధ్యమైందన్నారు. మహిళల రక్షణ విషయంలో చంద్రబాబు గారు ఎంత కఠినంగా ఉంటారో.. ఆడబిడ్డల జోలికి వస్తే తోలు తీస్తామని ఇప్పటికే ప్రాక్టికల్ గా నిరూపించారని లోకేష్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
