Indian origin woman

Indian origin woman: అమెరికాలో ఘోరం.. సూపర్ మార్కెట్‌లో గుజరాతీ మహిళను కాల్చి చంపిన దుండగుడు!

Indian origin woman: అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వర్జీనియా రాష్ట్రంలో పని చేసుకుంటున్న ఓ భారతీయ మహిళను ముసుగు వేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా కాల్చిచంపాడు. సూపర్ మార్కెట్‌లో జరిగిన ఈ ఘోర హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సంఘటన మే 23న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హత్యకు గురైన మహిళను గుజరాత్ రాష్ట్రానికి చెందిన 45 ఏళ్ల మేఘనా పటేల్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె గత పదేళ్లుగా వర్జీనియాలోని ఒక సూపర్ మార్కెట్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే ఆమె కౌంటర్ దగ్గర తన పనిలో నిమగ్నమై ఉండగా, ఒక వ్యక్తి కస్టమర్ లాగా లోపలికి వచ్చాడు. ముఖానికి మాస్క్, తలపై హుడీ టోపీ, చేతులకు గ్లోవ్స్ వేసుకుని వచ్చిన ఆ దుండగుడు.. కౌంటర్ దగ్గర ఉన్న మేఘనతో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఒక్కసారిగా తన వద్ద ఉన్న తుపాకీ తీసి ఆమెపై రెండు సార్లు కాల్పులు జరిపాడు.

బుల్లెట్లు బలంగా తగలడంతో మేఘనా పటేల్ అక్కడికక్కడే కౌంటర్ వెనుక పడిపోయింది. అంతటితో ఆగని ఆ క్రూరుడు కౌంటర్ పైకి ఎక్కి, కింద పడిపోయిన ఆమెపై మరోసారి కాల్పులు జరిపి అక్కడి నుండి వేగంగా పారిపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. అసలు ఆమెను ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మేఘనా పటేల్ స్వస్థలం గుజరాత్‌లోని మెహసానా జిల్లా, జన్ట్రాల్ గ్రామం. ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం గుజరాత్‌లోనే ఉంటున్నారు. మేఘన భర్త ఉపేంద్రభాయ్ పటేల్, కూతురు, కొడుకుతో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. ఈ ఏడాది అమెరికాలో దారుణ హత్యకు గురైన నాలుగో గుజరాతీ వ్యక్తి మేఘనా పటేల్ కావడం గమనార్హం. ఈ వరుస హత్యల సంఘటనలతో అమెరికాలో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా గుజరాతీ కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *