Movie Piracy: సినిమా పరిశ్రమకు పెద్ద ఊరట లభించింది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి దగ్గర నుంచి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్కులు, రికార్డింగ్ కెమెరాలు, ఇంటర్నెట్ టూల్స్ వంటి పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు, తమిళ, మళయాళం, హిందీ సినిమాలను రహస్యంగా రికార్డు చేసి ఆన్‌లైన్‌లో అమ్ముతూ, ఈ ముఠా కోట్లాది డబ్బు సంపాదించిందని పోలీసులు తెలిపారు. దీని వల్ల సినిమా ఇండస్ట్రీకి దాదాపు 22 వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటన గత రెండు నెలలకు ముందు మొదలైంది. జూలై 3న ‘హ్యాష్‌ట్యాగ్ సింగిల్’ సినిమా పైరసీపై తెలుగు సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నుంచి పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. వనస్థలిపురం నివాసి జన కిరణ్ కుమార్‌ను (29) అరెస్టు చేసిన తర్వాత విచారణలో, ఈ ముఠా దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్‌లో కూడా పనిచేస్తున్నట్లు తేలింది. కిరణ్, ఒక ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్, గత 18 నెలల్లో 40కి పైగా తెలుగు సినిమాలను రికార్డు చేసి, ‘1TamilMV’ వంటి పైరసీ గ్రూపులతో కలిసి లీక్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. థియేటర్‌లలో ప్రదర్శిస్తున్న సినిమాల శాటిలైట్ కంటెంట్‌ల ఐడీలు, పాస్‌వర్డులను క్రాక్ చేస్తూ, రిలీజ్‌కు ముందే సర్వర్‌లను హ్యాక్ చేస్తారు. క్రాక్ కాకపోతే, ఏజెంట్లకు రికార్డింగ్ కెమెరాలు ఇచ్చి రహస్యంగా చిత్రీకరించేలా నేర్పుతారు. ఆ ఏజెంట్లకు టికెట్లు బుక్ చేసి, చొక్కా జేబులు, పాప్‌కార్న్ డబ్బాలు, కోక్ టిన్‌లలో కెమెరాలు దాచి రికార్డు చేయిస్తారు. ఇలా రికార్డు చేసిన వీడియోలను iBomma, Bappam వంటి పైరసీ వెబ్‌సైట్లు, ఓటీటీ కంటెంట్‌లను కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లలో అప్‌లోడ్ చేసి అమ్ముతారు. ఏజెంట్లకు కమీషన్‌గా క్రిప్టో కరెన్సీ ఇస్తూ, డాలర్‌లలో ప్రాఫిట్ సంపాదిస్తారు. ముఠాలోని కీలక నిందితుడు ఇంటర్‌మీడియట్ వరకు చదివినవాడే అని, పోలీసులు తెలిపారు.
Also Read: TGSRTC Jobs 2025: ఐటీఐలో చేశారా.. రాత పరీక్ష లేకుండా జాబ్ పొందండి
ఈ ముఠా కేవలం తెలుగు సినిమాలు కాదు, పలు భాషల సినిమాలపై దృష్టి పెట్టింది. తాజా అరెస్టుల్లో ‘OG’తో పాటు కొత్త సినిమాలు పైరసీ చేసినట్లు కనుగొన్నారు. బెట్టింగ్ ముఠాలు ఈ పైరేటెడ్ వీడియోలను తమ సైట్లను ప్రమోట్ చేసుకోవడానికి స్పాన్సర్‌లుగా ఉపయోగిస్తున్నాయి. గతంలో 2024లో తెలుగు సినిమా పరిశ్రమకు 3,700 కోట్ల నష్టం జరిగినట్లు TFCC నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు సైబర్ పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పైరసీ ఒక నేరం. కాపీరైట్ యాక్ట్, సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ప్రకారం శిక్ష అనివార్యం. మేము నిర్మాతలు, నటులతో కలిసి పోరాటం చేస్తాం అని చెప్పారు. త్వరలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పైరసీ విధానాలు వివరిస్తారని తెలిపారు. రాబోయే రిలీజ్‌లకు ముందు సర్వైలెన్స్ పెంచిన పోలీసులు, మరిన్ని అరెస్టులు జరుగుతాయని హామీ ఇచ్చారు. సినిమా ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు ఈ చర్యలను స్వాగతించుతూ, పైరసీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.