Telangana Bandh: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే న్యాయమైన డిమాండ్‌తో బీసీ ఐకాస (BC JAC) తలపెట్టిన రాష్ట్ర బంద్ తెలంగాణ వ్యాప్తంగా విజయవంతంగా జరుగుతోంది. అత్యవసర సేవలు మినహా, అన్ని రంగాల సేవలు నిలిచిపోవడంతో రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఉదయం 4 గంటల నుంచే బంద్ మొదలై, రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతోంది.
ఏకతాటిపై రాజకీయ పార్టీలు
బీసీల రిజర్వేషన్ల పోరాటానికి తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో పాటు అనేక విద్యార్థి, ప్రజా సంఘాలు, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు వంటి సంస్థలు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపాయి.
కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని వివిధ డిపోల వద్ద ఆందోళనల్లో పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. మరోవైపు, బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి వెళ్లి నిరసనల్లో పాల్గొనగా, బీజేపీ నేత ఈటల రాజేందర్ జేబీఎస్ వద్ద నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధర్నాలో పాల్గొని, చట్టాలు చేయాల్సిన పార్టీలు రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కడం విడ్డూరమని విమర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఖైరతాబాద్‌లో మానవహారం నిర్వహించి మద్దతు తెలిపారు.
Also Read: AFG vs PAK: పాక్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్ల మృతి
స్తంభించిన రవాణా, పరీక్షల వాయిదా
బంద్ ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. ఉదయం నుంచే బీసీ సంఘాల నాయకులు ఆర్టీసీ డిపోల ముందు ధర్నాలు చేయడంతో, హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాలైన నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కొత్తగూడెం డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేకపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
బంద్‌కు మద్దతుగా ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. అంతేకాక, ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఏపీ సీపీఐ కూడా ఈ బంద్‌కు మద్దతు తెలిపింది.
శాంతియుత బంద్‌కు డీజీపీ సూచన
బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అత్యవసర సర్వీసులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.