Pawan Kalyan: విశాఖపట్నంలో అక్రమంగా పెద్ద మొత్తంలో గోమాంసాన్ని నిల్వ చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ నిల్వల వెనుక ఉన్న ముఠాల అసలు మూలాలను వెంటనే బయటపెట్టాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన విశాఖ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా, ఎంతటి పెద్దవారున్నా సరే, ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
పోలీసు కమిషనర్‌తో మాట్లాడిన పవన్
విశాఖలో భారీ స్థాయిలో గోమాంసం నిల్వలు బయటపడిన వెంటనే, పవన్ కల్యాణ్ స్వయంగా పోలీసు కమిషనర్‌ను సంప్రదించారు. కేసు వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో గోమాంసాన్ని ఒకే చోట ఎలా నిల్వ చేశారు? అది ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తరలించడానికి సిద్ధమయ్యారు? అనే విషయాలపై ఆయన వివరంగా అడిగి తెలుసుకున్నారు.
Also Read: Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు!
1.89 లక్షల కిలోల గోమాంసం స్వాధీనం
డీఆర్‌ఐ (DRI) అధికారులు మిత్ర కోల్డ్ స్టోరేజీలో దాడులు నిర్వహించి 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారని, ఆ తర్వాత కేసును పోలీసులకు అప్పగించారని కమిషనర్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. దాడుల సమయంలో కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? అక్రమ రవాణా నెట్‌వర్క్ ఎంత పెద్దది? అనుమతులు సరిగా ఉన్నాయా? అనే అంశాలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని కమిషనర్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
కఠిన చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం హెచ్చరిక
ఈ ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్, ఎన్డీయే (NDA) ప్రభుత్వం గోమాంసం నిషేధంపై ఎంత దృఢంగా ఉంటుందో ఈ కేసు మరోసారి నిరూపించిందని అన్నారు. అక్రమంగా గోవధ చేసినా, గోమాంసాన్ని విక్రయించినా, లేదా ఎగుమతి చేసినా, ఏ రూపంలో జరిగినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గతంలో పిఠాపురంలో జరిగిన జంతు వధశాల ఘటన వెలుగులోకి రాగానే, దానిపై వెంటనే చర్యలు తీసుకుని మూసివేయించిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

