Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి, పటిష్టమైన రోడ్లను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ (Special Assistance to States for Capital Investment – SASKI) పథకం కింద రాష్ట్రానికి ₹2 వేల కోట్లు నిధులు సమకూర్చిందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఈ నిధులను సద్వినియోగం చేసుకొని, రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
అధికారులకు కీలక ఆదేశాలు: క్వాలిటీ చెక్ తప్పనిసరి
పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాణ్యతా ప్రమాణాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమం చేపడతామని, ఇందులో బాగా దెబ్బ తిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
“రహదారుల నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా, ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే. ఎక్కడా నాణ్యత విషయంలో రాజీపడవద్దు” అని తేల్చి చెప్పారు.నిర్మాణంలో ఏ మాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించవద్దని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Indian Student Visa: కెనడాలో భారతీయ విద్యార్థులకు షాక్
ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.కాంట్రాక్టు పొందినవారికి ముందుగానే నాణ్యతా ప్రమాణాల గురించి తెలియచేయాలని, “నేను, నిపుణులు క్షేత్ర స్థాయికి వెళ్లి నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదో తనిఖీ చేస్తాము” అని ప్రకటించారు.
పుట్టపర్తికి ₹35 కోట్లు కేటాయింపు
‘సాస్కి’ నిధుల వినియోగంలో భాగంగా, ప్రత్యేక ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
శ్రీ సత్య సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా, పుట్టపర్తిలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా పంచాయతీ రోడ్లను పటిష్టం చేయడానికి ఈ నిధుల నుంచి ₹35 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పటిష్టమైన రోడ్లు అందించడం అత్యంత అవసరం. మౌలిక వసతుల కల్పనలో రహదారులు కీలకమైనవని పవన్ కళ్యాణ్ అన్నారు.
కేంద్ర సహకారం, కూటమి ప్రభుత్వం నిబద్ధత
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, రాష్ట్రంలో వాటిని వినియోగించడంలో సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి ఈ నిధులు తీసుకువచ్చాం” అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Naxal: నక్సల్స్‌కు భారీ దెబ్బ – రహస్య ఆయుధ కర్మాగారం ధ్వంసం
రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం అలక్ష్యంగా వ్యవహరించిందని, కేంద్రం నుంచి నిధులు వచ్చే వెసులుబాటు ఉన్నా విస్మరించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలని కృత నిశ్చయంతో ఉందని, ఇందులో అధికార యంత్రాంగం కీలక భూమిక పోషించాలని ఆయన స్పష్టం చేశారు.

