Pappu Yadav: తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి తక్షణమే ఆమోదం తెలిపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మహా ధర్నా చేపట్టింది.
ఈ ఆందోళనకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వం వహిస్తున్నారు. భారత్ జోడో వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి పలువురు విపక్ష నేతలు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా బీహార్ ఎంపీ పప్పు యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “దేశంలో మార్పు, సామాజిక న్యాయం కోసం పోరాటాలు దక్షిణ భారతదేశం నుంచే ప్రారంభమవుతాయి. దక్షిణాది ప్రజలు మేల్కొంటే, కేంద్రంలోని ప్రజావ్యతిరేక శక్తులు ఓడిపోవడం ఖాయం. బీసీ రిజర్వేషన్ల పోరాటం ఇది కేవలం ఏ వర్గం మధ్య పోరాటం కాదు… ఇది సమాజంలో సమానత్వం కోసం నడిపే ఉద్యమం. పెరియార్, అంబేడ్కర్, ఫూలే సిద్ధాంతాల స్ఫూర్తి ఈ పోరాటానికి బలం,” అంటూ వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమిలోని అనేక పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేస్తున్నారు.