Tilak Varma

Tilak Varma: ‘మైదానంలో పాక్ ప్లేయర్‌లు రెచ్చగొట్టారు’.. అసలు విషయం చెప్పిన తిలక్ వర్మ

Tilak Varma: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయానికి నిజమైన హీరోగా నిలిచిన పేరు హైదరాబాద్ యంగ్ స్టార్ తిలక్ వర్మ. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఒత్తిడితో కూడిన ఫైనల్ వేదికపై అద్భుత ఇన్నింగ్స్ ఆడి, జట్టును విజయపథంలో నడిపించాడు.

కష్టసమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన తిలక్

చేసింగ్ ఆరంభం కాగానే భారత్ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి బిక్కమొహాలయ్యింది. అలాంటి క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, పాకిస్తాన్ బౌలర్ల దూకుడుకు లొంగిపోకుండా నిలదొక్కుకున్నాడు. పాకిస్తాన్ ఆటగాళ్లు పదే పదే స్లెడ్జింగ్ చేస్తూ రెచ్చగొట్టినా, ప్రశాంతంగా ఆడుతూ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.

“దేశం కళ్ల ముందే కనిపించింది”

హైదరాబాద్‌లోని లెగాలా క్రికెట్ అకాడమీకి వెళ్లి తన కోచ్‌, అభిమానులతో విజయాన్ని పంచుకున్న తిలక్ మీడియాతో మాట్లాడుతూ.. “పాకిస్తాన్ ప్లేయర్లు పదే పదే రెచ్చగొట్టారు. కోపం వచ్చిందే కానీ.. ఆ సమయంలో కళ్ల ముందే దేశం కనిపించింది. అందుకే ఆతురపడి తప్పు చేయకుండా ఓపికగా ఆడాను. అప్పటికే మూడు కీలక వికెట్లు పడిపోవడంతో బాధ్యత మరింతగా అనిపించింది. దాంతో కసిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాం. ఈ విజయం భారత జవాన్లకే అంకితం” అని స్పష్టంచేశాడు.

ఇది కూడా చదవండి: V C Sajjanar: ‘ఆడపిల్లల జోలికి వస్తే చుక్కలు చూపిస్తా’.. సజ్జనార్ వార్నింగ్

పర్‌ఫెక్ట్ రిప్లై

మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ తనదైన శైలిలో పాకిస్తాన్ ప్లేయర్లకు జవాబు ఇచ్చాడని చెప్పాడు. “వారు మాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ నేను ప్రశాంతంగా ఉండి జట్టుకు గెలుపు అందించాను. గెలిచిన తర్వాత వారికి పర్‌ఫెక్ట్‌గా సమాధానం ఇచ్చాను.. అది అందరూ చూశారు” అని చిరునవ్వుతో వ్యాఖ్యానించాడు.

అద్భుత ఇన్నింగ్స్ – భవిష్యత్తు ఆస్తి

తిలక్ వర్మ 69 పరుగులు నాటౌట్‌గా చేసి, సంజు శాంసన్, శివమ్ దూబేలతో కలిసి కీలక భాగస్వామ్యాలు కట్టాడు. అతని అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత చూపిన దూకుడు మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఒత్తిడిని తట్టుకుని, సమిష్టి ఆటతో జట్టును విజయానికి నడిపిన తీరు, తిలక్ వర్మలో ఉన్న పరిపక్వతను మరోసారి రుజువు చేసింది.

తల్లిదండ్రులు, కోచ్‌దే క్రెడిట్

ఈ విజయానికి తన తల్లిదండ్రులు, కోచ్ కారణమని తిలక్ వినయంగా తెలిపాడు. చిన్నప్పటి నుంచి నేర్పిన విలువలే, శిక్షణలో నేర్చుకున్న పాఠాలే తనను ఇక్కడికి తీసుకువచ్చాయని కృతజ్ఞతలు తెలిపాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *