Vanajeevi Ramaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, పర్యావరణ సంరక్షణలో అపూర్వ కృషి చేసిన వనజీవి రామయ్య ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులతో పాటు ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు తీవ్ర శోకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మొక్కలతో మమేకమైన జీవితం
వనజీవి రామయ్య అసలు పేరు దరిపెల్లి రామయ్య. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆయన చిన్నతనంనుంచే మొక్కలపై అపారమైన ప్రేమతో జీవితం గడిపారు. ప్రకృతిని పరిరక్షించాలనే తపనతో కోటికిపైగా మొక్కలు నాటిన రామయ్య, తన ఇంటి పేరునే ‘వనజీవి’గా మార్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Tahawwur Rana: నాకు గుర్తులేదు.. నాకు తెలియదు.. 3 గంటల విచారణలో తహవుర్ రానా ఏం చెప్పారు అంటే..?
వేసవిలో అడవుల్లోకి వెళ్లి విత్తనాలు సేకరించి వాటిని నిల్వచేసి, వర్షాకాలం ప్రారంభంలో రోడ్ల ప్రక్కన, ఖాళీ ప్రదేశాల్లో చల్లి మొక్కలు పెంచడం ఆయన ప్రత్యేకత. “వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదంతో, తన మెడలో ఆ నినాదాన్ని కట్టుకొని దేశవ్యాప్తంగా పర్యావరణం పై అవగాహన కల్పించారు.
పద్మశ్రీతో పురస్కారాన్ని అందుకున్న పర్యావరణ యోధుడు
2017లో కేంద్ర ప్రభుత్వం వనజీవి రామయ్యకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసి ఆయన సేవలకు గౌరవం తెలిపింది. మొక్కలపైన ఆయనకున్న ప్రేమను చూపించే ఉదాహరణగా, తన మనవరాళ్లకు కూడా మొక్కల పేర్లే పెట్టారు.
జీవితం ఒక మార్గదర్శకంగా
వనజీవి రామయ్య జీవితం అనేకరికి స్పూర్తిగా నిలిచింది. ప్రకృతి రక్షణలో ఆయన చూపిన నిబద్ధత, సాధారణ జీవనశైలి, సేవా దృక్పథం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆయన మృతి పట్ల అనేకమంది ప్రజలు తమ ఘన నివాళులు అర్పిస్తున్నారు.