Hit Jodis: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విజయవంతమైన జంటలు ఇప్పుడు మళ్లీ తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. సీనియర్ నటుల నుంచి యువ హీరోల వరకు, తమ కెమిస్ట్రీ అద్భుతంగా పండిన హీరోయిన్లతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
1. నాగార్జున – టబు: 25 ఏళ్ల తర్వాత పునరాగమనం
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, అందాల నటి టబు జోడీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఈ జంటకు బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించింది. దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, నాగార్జున 100వ సినిమా కోసం ఈ జంట మళ్లీ కలిసి నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నాగచైతన్య, అఖిల్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.
2. వెంకటేష్ – మీనా: ‘దృశ్యం 3’తో మళ్లీ అదే కెమిస్ట్రీ
టాలీవుడ్లో అత్యంత విజయవంతమైన జంటల్లో వెంకటేష్, మీనా జోడీ ఒకటి. ‘చంటి’ సినిమాతో మొదలైన వీరి కెమిస్ట్రీ, ‘దృశ్యం 2’ వరకు అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ ‘దృశ్యం 3’లో కూడా భార్యాభర్తలుగా కనిపించబోతోంది. మలయాళంలో ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, తెలుగు వెర్షన్‌ను దర్శకుడు జీతు జోసెఫ్ త్వరలో ప్రారంభించనున్నారు.
Also Read: Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్ దూరం?
3. రజనీకాంత్ – రమ్యకృష్ణ: ‘జైలర్ 2’లో కొనసాగనున్న బంధం
సూపర్ స్టార్ రజనీకాంత్, రమ్యకృష్ణ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘నరసింహ’ చిత్రంలో నరసింహా, నీలాంబరి పాత్రలతో ఈ జంట సంచలనం సృష్టించింది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ వీరిని ‘జైలర్’ సినిమాలో భార్యాభర్తలుగా చూపించారు. ఆ మ్యాజిక్‌ను కొనసాగిస్తూ, రాబోయే ‘జైలర్ 2’లో కూడా వీరిద్దరి కెమిస్ట్రీ కొనసాగనుందని తెలుస్తోంది.
4. యంగ్ హీరోల జోడీలు కూడా:
సీనియర్లతో పాటు యువ హీరోలు కూడా హిట్ కాంబినేషన్లను రిపీట్ చేయాలని చూస్తున్నారు.
ధనుష్ – సాయి పల్లవి: ‘మారి 2’ (రౌడీ బేబీ) తర్వాత ఏడేళ్లకు వీరిద్దరూ మరోసారి జోడీ కట్టబోతున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్గా ఎంచుకున్నట్లు సమాచారం.
శివకార్తికేయన్ – శ్రీలీల: హీరోయిన్లను రిపీట్ చేసే హీరోగా పేరున్న శివకార్తికేయన్, ప్రస్తుతం ‘పరాశక్తి’ సినిమాలో నటిస్తున్న శ్రీలీలతో మరోసారి జతకట్టబోతున్నాడు. ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో రాబోయే తన కొత్త సినిమాకు కూడా శివ, శ్రీలీలను సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన జోడీలు తమ గత విజయాలను మళ్లీ రిపీట్ చేసి, ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తాయని అభిమానులు గట్టిగా విశ్వసిస్తున్నారు.