Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన ఈ వానకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పై అంతస్తు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ భవనం నిజాం కాలం నాటిది కావడంతో పాతబడిపోయింది.
పెను ప్రమాదం తప్పింది
భారీ శబ్దంతో పైకప్పు కూలడంతో కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్లాబ్ నెమ్మదిగా కూలడం గమనించిన ఉద్యోగులు వెంటనే బయటికి పరుగులు తీశారు. కూలిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి సమీక్ష సమయంలోనే ఘటన
ఈ ఘటన జరిగిన సమయంలో జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా పర్యటనలో ఉన్నారు. కలెక్టర్ కార్యాలయం వెనుక ఉన్న సమావేశ మందిరంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షపు నీరు కార్యాలయం ప్రాంగణంలో నిలిచిపోయింది. పాత భవనం కావడంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు. ఈ ఘటనతో పురాతన భవనాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.