Ajit Doval: ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో మన దేశానికి నష్టం కలిగిందని విదేశీ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ, భారత్‌కు నష్టం జరిగిందని నిరూపించడానికి కనీసం ఒక్క ఫోటోనైనా, శాటిలైట్ చిత్రాన్నైనా చూపించాలని ఆయన సవాల్ విసిరారు.
డోభాల్ మాట్లాడుతూ, భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’లో అత్యంత కచ్చితత్వంతో వ్యవహరించిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉన్నాయనే దానిపై పక్కా సమాచారంతోనే దాడులు చేశామని తెలిపారు. కేవలం 32 నిమిషాల్లోనే పాకిస్థాన్ లోపల ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై విజయవంతంగా దాడులు జరిపామని, ఒక్క లక్ష్యాన్ని కూడా వదిలిపెట్టలేదని ఆయన వెల్లడించారు. ఇది భారతదేశ ఇంటెలిజెన్స్, కార్యాచరణ సామర్థ్యాన్ని చాటిచెప్పిందని అన్నారు.
‘ది న్యూయార్క్ టైమ్స్’ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ భారత్‌పై దాడులు చేసిందని, నష్టం కలిగించిందని తప్పుడు కథనాలు ప్రచారం చేశాయని ధోవల్ మండిపడ్డారు. అయితే, శాటిలైట్ చిత్రాలు దీనికి భిన్నమైన వాస్తవాలను బయటపెట్టాయని ఆయన అన్నారు. మే 10వ తేదీకి ముందు, ఆ తర్వాత తీసిన శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే, పాకిస్థాన్‌లోని 13 ఎయిర్‌బేస్‌లకు కూడా ఎలాంటి నష్టం జరగలేదని తేలిందని ధోవల్ స్పష్టం చేశారు. అదే సమయంలో, భారత్‌కు చెందిన ఆయుధ స్థావరాలపై కనీసం చిన్న గీత కూడా పడలేదని ఆయన నొక్కి చెప్పారు.
Also Read: Delhi: రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ అధిష్ఠానం ఆమోదం
Ajit Doval: ఈ ఆపరేషన్‌లో భారతదేశం స్వదేశీ రక్షణ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించిందని డోభాల్ తెలిపారు. సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్ భూభాగంలోకి లోతుగా చొచ్చుకుపోయి పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయని చెప్పారు. అంతేకాకుండా, పాకిస్థాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థతో గాలిలోనే సమర్థవంతంగా పేల్చివేశాయని వెల్లడించారు.
భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను, యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన సాధన సంపత్తిని దేశీయంగానే రూపొందిస్తున్నామని డోభాల్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ భారతదేశ అధునాతన ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని, ఖచ్చితమైన దాడుల నైపుణ్యాన్ని నిరూపించిందని ఆయన పునరుద్ఘాటించారు.