DGCA: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత భారతీయ విమానయాన రంగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా విడుదల చేసిన నివేదికలో గత ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
పైలట్ల చాకచక్యంతో తప్పిన ప్రమాదాలు
డీజీసీఏ నివేదిక ప్రకారం, 2024 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు మొత్తం 11 మే డే కాల్స్ నమోదయ్యాయి. విమానం లేదా నౌక తీవ్ర ముప్పులో చిక్కుకున్నప్పుడు పైలట్లు అత్యవసరంగా సహాయం కోరే సందేశాన్ని “మే డే”గా పిలుస్తారు. ఈ 11 మే డే సందర్భాల్లోనూ పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదాలు తప్పాయి. అయితే, ప్రతి సారి పైలట్లు సమస్యలను అధిగమించడం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రధాన కారణాలు – పైలట్ల సమాఖ్య వివరాలు
విమాన ఇంజిన్ వైఫల్యాలకు ఇంధన ఫిల్టర్లు బ్లాక్ అవ్వడం, టర్బైన్ లోపాలు, ఇంధన కాలుష్యం, ఇంధన సరఫరా ఆగిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయని భారత పైలట్ల సమాఖ్య అధ్యక్షుడు కెప్టెన్ సీఎస్ రాంధవా తెలిపారు.
ఇది కూడా చదవండి: Murder Case: మలక్‌పేట కాల్పుల ఘటనలో నలుగురు లొంగుబాటు
భారతీయ విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు – డీజీసీఏ ఆందోళన
డీజీసీఏ ఎయిర్ సేఫ్టీ డైరెక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో సాంకేతిక సమస్యలు సాధారణమే అయినా, భారతీయ విమానాల్లో తరచూ సమస్యలు తలెత్తడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు.
ఎయిరిండియా ప్రమాదం తర్వాత ప్రత్యేక తనిఖీలు
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా ప్రమాదానికి ఇంధన స్విచ్ వైఫల్యం కారణమని ప్రాథమిక నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో, డీజీసీఏ బోయింగ్ 787, 737 రకం విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థను తప్పనిసరిగా తనిఖీ చేయాలని విమానయాన సంస్థలకు ఆదేశించింది. భారత్‌లోని ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ్ ఎయిర్, స్పైస్‌జెట్ వంటి సంస్థలు ఈ రకం విమానాలను నడుపుతున్నాయి.