Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష పడిన కేరళ నర్సు నిమిషా ప్రియకు ఊరట లభించింది. జులై 16 (బుధవారం) ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా, చివరి క్షణంలో అది వాయిదా పడింది. భారత ప్రభుత్వం, నిమిషా కుటుంబం జరిపిన తీవ్ర ప్రయత్నాలు, చర్చల ఫలితంగా ఈ నిర్ణయం వెలువడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నిమిషా ప్రియ, 2011లో నర్సుగా ఉపాధి కోసం యెమెన్‌కు వెళ్లారు. 2014లో యెమెన్‌లో యుద్ధం తీవ్రం కావడంతో ఆమె భర్త, కుమార్తె భారతదేశానికి తిరిగి వచ్చారు. అయితే, కుటుంబాన్ని పోషించుకోవడానికి నిమిషా అక్కడే ఉండిపోయారు. యెమెన్ చట్టాల ప్రకారం, విదేశీ వైద్య నిపుణులు క్లినిక్ తెరవాలంటే స్థానిక యెమెన్ జాతీయుడితో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి. ఈ క్రమంలో నిమిషా, తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ ప్రారంభించారు.
అయితే, తలాల్ అబ్దో మహదీ తనను మోసం చేశాడని, నకిలీ పత్రాలతో ఆమెను వివాహం చేసుకున్నట్లు సృష్టించాడని, పాస్‌పోర్ట్‌ను లాక్కున్నాడని, చాలా సంవత్సరాలు శారీరకంగా వేధించాడని, ఆర్థిక దోపిడీకి, బెదిరింపులకు గురిచేశాడని నిమిషా ప్రియ ఆరోపించారు. తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందడానికి, యెమెన్‌ను విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తూ, 2017లో మహదీకి మత్తుమందు ఇచ్చారు. దురదృష్టవశాత్తు, మత్తు మోతాదు అధికమై మహదీ మరణించాడు. నిమిషా, మహదీ శరీరాన్ని ముక్కలు చేసి పారవేసినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Also Read: Miss Kavitha BRS: మ్యాగీపై ఉన్నంత ప్రేమ కూడా కవితపై లేదా?
ఈ కేసులో యెమెన్ న్యాయస్థానం 2020లో నిమిషాకు మరణశిక్ష విధించింది. 2023లో హౌతీల సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఈ తీర్పును సమర్థించింది. నిమిషాను రక్షించడానికి ఆమె కుటుంబం, భారత ప్రభుత్వం, వివిధ సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. యెమెన్‌లో షరియా చట్టం ప్రకారం, బాధితుడి కుటుంబం క్షమించి, ‘బ్లడ్ మనీ’ (దియ) స్వీకరించడానికి అంగీకరిస్తే మరణశిక్షను రద్దు చేసే అవకాశం ఉంది. నిమిషా కుటుంబం బాధితుడి కుటుంబానికి 1 మిలియన్ డాలర్లు (సుమారు ₹8.6 కోట్లు) ‘బ్లడ్ మనీ’గా చెల్లించడానికి సిద్ధమైంది.
తాజాగా, హత్యకు గురైన తలాల్ అబ్దో మహదీ కుటుంబం, గిరిజన నాయకులతో జరిపిన చర్చల అనంతరం ఈ ఉరిశిక్షను వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నారు. కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ జోక్యం తర్వాత అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి. గిరిజన నాయకులు, తలాల్ బంధువులు, న్యాయ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు ఈ చర్చలలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం కూడా యెమెన్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి, ఉరిశిక్షను ఆపాలని చివరి క్షణంలో కూడా విజ్ఞప్తి చేసింది. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి, చివరి క్షణంలో ఉరిశిక్ష వాయిదా పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిమిషాను రక్షించడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తోంది.