US Visa

US Visa: వీసాలపై అమెరికా మరో షాక్: 15,000 డాలర్లు కట్టాల్సిందే..!

US Visa: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి ట్రంప్‌ ప్రభుత్వం మరో కఠిన నిబంధనను తీసుకువచ్చింది. వ్యాపారం లేదా పర్యాటక వీసా (B-1, B-2) కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇప్పుడు సెక్యూరిటీ బాండ్‌ కింద $5,000 నుండి $15,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

మంగళవారం ఫెడరల్ రిజిస్ట్రీలో ఈ నోటీసును ప్రచురించనున్నారు. ఇది 12 నెలల పాటు అమలులో ఉండే ఒక పైలట్ ప్రోగ్రామ్ అని విదేశాంగ శాఖ తెలిపింది. నోటీసు వెలువడిన 15 రోజుల తర్వాత ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. దీని ప్రకారం, వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలోనే ఈ బాండ్‌ మొత్తాన్ని చెల్లించాలి. వీసా గడువు ముగిసిన తర్వాత దరఖాస్తుదారుడు దేశాన్ని వీడితే, ఆ డబ్బును తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో అక్రమంగా ఉంటే, ఈ బాండ్‌ మొత్తం తిరిగి ఇవ్వబడదు.

Also Read: Phone Tapping Case: ప్రభాకర్‌రావు బెయిల్‌పై విచారణ వాయిదా

ఈ కొత్త నిబంధన అన్ని దేశాల పౌరులకు వర్తించదు. ఏయే దేశాల నుంచి వచ్చే వారికి ఈ బాండ్ అవసరమో త్వరలో అమెరికా విదేశాంగ శాఖ ఒక జాబితాను విడుదల చేయనుంది. ఈ కొత్త నిబంధన వీసా మినహాయింపు కార్యక్రమంలో భాగమైన 42 దేశాల పౌరులకు వర్తించదు. ఈ 42 దేశాలలో ఎక్కువగా ఐరోపా దేశాలు, కొన్ని ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు ఉన్నాయి. దరఖాస్తుదారుల వ్యక్తిగత పరిస్థితులను బట్టి బాండ్ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.

ట్రంప్ ప్రభుత్వం గతంలో 2020లో కూడా ఇలాంటి పైలట్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. అప్పట్లో కోవిడ్ కారణంగా ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. వీసా గడువు తీరిన తర్వాత కూడా కొందరు దేశం విడిచి వెళ్లకపోవడం వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందని, అందుకే ఈ నిబంధనలు తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వీసాలను కఠినతరం చేసే ప్రయత్నంలో ఇది మరో అడుగు అని స్పష్టం అవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *