Nepal PM: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి హిందూ దేవతల జన్మస్థలాలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. శ్రీరాముడు నేపాల్ భూభాగంలోనే జన్మించాడని ఆయన సోమవారం ఖాట్మండులో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో గట్టిగా నొక్కి చెప్పారు. అంతేకాదు, వాల్మీకి రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని, శివుడు, విశ్వామిత్రుడు వంటి పురాణ పురుషులు కూడా నేపాల్‌లోనే పుట్టారని ఆయన ప్రకటించారు.
సాధారణంగా శ్రీరామచంద్రమూర్తి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించారని పురాణాలు, ఇతిహాసాలు చెబుతాయి. అయితే, ఓలీ 2020లో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు. అప్పట్లో అయోధ్య తమ దేశంలోని చిత్వాన్‌లోని థోరిలో ఉందని, అక్కడే రాముడు పుట్టాడని ఆయన వాదించారు. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటించడంతో పాటు, ప్రజలు ఈ విషయాన్ని ప్రచారం చేయడానికి ఏమాత్రం సంకోచించవద్దని పిలుపునిచ్చారు.
Also Read: Nara Lokesh: వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా?
Nepal PM: రాముడు పుట్టిన స్థలం నేపాల్‌లోనే ఉందని, అది ఇప్పటికీ అక్కడే ఉందని ఓలీ తెలిపారు. ఈ విషయాన్ని తాము అంతగా ప్రచారం చేయలేకపోతున్నామని, దీనిపై మాట్లాడటానికి వెనుకాడకూడదని అన్నారు. రాముడు ఎందరికో దైవం అయినప్పటికీ, ఆయన జన్మస్థలం గురించి నేపాల్ చురుకుగా ప్రచారం చేయలేకపోవడం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంకా ఆశ్చర్యకరంగా, శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశం నుంచే వచ్చినవారని ఓలీ పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంలోనే ఇది కూడా ఉందని, విశ్వామిత్రుడు చతరాలో జన్మించాడని, ఇతిహాసాల్లో ప్రస్తావించిన ప్రదేశాలు ప్రస్తుతం తమ దేశంలోని సున్‌సారి జిల్లాలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ఓలీ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్, నేపాల్ మధ్య సాంస్కృతిక, మతపరమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. హిందూ మత విశ్వాసాలకు కీలకమైన ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారాయి.