Nepal Gen Z Protest: నేపాల్‌లో యువత ఆగ్రహం మళ్లీ రాజకీయం కుదేలైపోయే స్థాయికి చేరింది. కె.పి. శర్మ ఓలి ప్రభుత్వ అణచివేత చర్యలపై సెప్టెంబర్ 9న ‘Gen Z’ నిరసనకారులు ప్రభుత్వ భవనాలు, మాజీ ప్రధాన మంత్రుల ఇళ్లు, రాజకీయ పార్టీల కార్యాలయాలకు నిప్పుపెట్టారు. ఇది కాఠ్మాండులో పోలీసులు కాల్పులు జరిపి 19 మంది యువ నిరసనకారులు మృతి చెందిన మరుసటి రోజే జరగడం విశేషం. ఈ పరిణామాల తరువాత దేశం ప్రభుత్వ రహితంగా, అశాంతి వాతావరణంలో మునిగిపోయింది.
ఎవరు ఈ నిరసనకారులు?
రెండు నెలల క్రితం సోషల్ మీడియాలో “Next Generation Nepal” వంటి పేజీలు అవినీతి, దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. ఈ ఉద్యమానికి ప్రధానంగా 1996–2012 మధ్య జన్మించిన యువతే (Gen Z) హాజరయ్యారని తెలుస్తోంది.
రాజకీయ నేతల అవినీతి ఇంకా 2008లో గణతంత్రం ఏర్పడినప్పటి నుండి బాధ్యతారహిత పాలన, రాజకీయ నేతల పిల్లల విలాసవంతమైన జీవనశైలి (“Nepo Kids”) ఇవన్నీ యువత కోపానికి కారణమయ్యాయి.
సోషల్ మీడియా నిషేధమే చిచ్చు
ప్రభుత్వం ఇటీవల 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించడంతో నిరసనలు మరింత త్రీవ్రస్థాయికి తీసుకోని వెళ్లాయి . ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్ బ్లాక్ చేయడం యువతకు తట్టుకోలేని దెబ్బగా మారింది.
సోమవారం జరిగిన నిరసనల్లో పోలీసులు కాల్పులు జరపగా 19 మంది యువకులు మృతి చెందారు. యువత డిమాండ్ — సోషల్ మీడియా పునరుద్ధరణ, అవినీతి నిర్మూలన, సమానత్వం, ఉద్యోగ అవకాశాలు. అంటూ డిమాండ్ చేశారు అదే రోజు సాయంత్రం నిషేధం సోషల్ మీడియా బాన్ ని ఎత్తివేశారు. కానీ యువతలో ఆగ్రహం మాత్రం చల్లారలేదు.
ఇది కూడా చదవండి: Lokesh In War Room: ప్రజల కష్టాలే ముఖ్యం.. ఇలాంటి నాయకత్వం ఏపీ అదృష్టం!
దాడుల బారిన పడిన నేతలు
మంగళవారం నిరసనకారులు నేరుగా అగ్ర రాజకీయ నేతల ఇళ్లపై దాడి చేశారు. మాజీ ప్రధానమంత్రులు ఓలి, ప్రచండ, మాధవ్ కుమార్ నేపాల్, ఝలానాథ్ ఖనాల్, షేర్ బహాదూర్ డియుబా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
-
ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ మంటల్లో ప్రాణాలు కోల్పోయారు.
-
మాజీ ప్రధాని డియుబా, ఆయన భార్య అర్జు డియుబా (విదేశాంగ మంత్రి)పై దాడి జరగగా, డియుబా తీవ్రంగా గాయపడ్డారు.
-
ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్, ఎంపీ ఎక్నాథ్ ధాకల్‌ను వీధుల్లో అవమానించారు.
-
లలిత్‌పూర్‌లోని నక్కు సెంట్రల్ జైలుకు నిప్పు పెట్టి, అక్కడ ఉన్న RSP నేత రవి లామిచ్ఛానేను విడుదల చేశారు.
దేశం ఎటు వెళ్తోంది?
ప్రధాని ఓలి ఇప్పటికే రాజీనామా చేయగా, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ సైన్యం రక్షణలో అదృశ్యమయ్యారు. పార్లమెంట్ రద్దు డిమాండ్లు పెరుగుతున్నాయి. దేశం రాజ్యాంగ సంక్షోభం వైపు దూసుకెళ్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సైన్యాధిపతి అశోక్ రాజ్ సిగ్డెల్ శాంతి పిలుపునిస్తూ, కాఠ్మాండు మేయర్ బలెన్ షా, RSP నేత రవి లామిచ్ఛానే వంటి యువ నేతలను చర్చలకు ఆహ్వానించారు. అయితే సైన్యం నేరుగా రాజకీయాల్లో జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువే.
ప్రతిపక్షం, మాజీ రాజు స్పందన
-
ప్రతిపక్షం RPP (రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ) పార్లమెంట్ నుంచి రాజీనామా చేయాలని ఆలోచిస్తోంది.
-
బలెన్ షా, రవి లామిచ్ఛానే వంటి నేతలు Gen Z నిరసనలకు మద్దతు తెలిపారు.
-
మాజీ రాజు జ్ఞానేంద్ర షా బాధిత కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, అన్ని వర్గాలు కలిసి పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు. ఇది ఆయన తాత్కాలిక రాజకీయ పాత్రను తిరిగి పోషించవచ్చనే సంకేతాలు ఇస్తోంది.
భారత్ ఆందోళన
నేపాల్ అగ్నిపర్వతంలా మాగుతున్న ఈ పరిస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది.
మోడీ వ్యాఖ్యానిస్తూ: “నేపాల్‌లో శాంతి, స్థిరత్వం, అభివృద్ధి మాకు అత్యంత ప్రాధాన్యం. హింస మనసును కలచివేస్తోంది” అని అన్నారు.