Pawan Kalyan: బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన అద్భుత విజయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. బిహార్ ప్రజల ఈ తీర్పు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న తిరుగులేని విశ్వాసాన్ని మరోసారి రుజువు చేసిందని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం బిహార్, తెలంగాణలో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అమరావతిలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ… భారత దేశ సమగ్రాభివృద్ధి, సుస్థిర పాలన మోదీతోనే సాధ్యమని యావత్ దేశ ప్రజలు బలంగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. బిహార్లో ఎన్డీయే కూటమి సాధించిన స్థానాలు మోదీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
నితీశ్ కుమార్కు, అమిత్ షాకు అభినందనలు
ఈ భారీ విజయానికి కారకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. సుదీర్ఘ కాలం నుంచి బిహార్ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న నితీశ్ కుమార్ పట్ల ఆ రాష్ట్ర ప్రజలకు ఉన్న అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. నితీశ్ నాయకత్వంలో బిహార్లో విద్య, వైద్య ప్రమాణాలు మెరుగుపడ్డాయని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రం ముందుకు వెళ్తోందని కితాబిచ్చారు.
Also Read: TPCC Chief Mahesh: జూబ్లీహిల్స్ తీర్పు అభివృద్ధి, సంక్షేమానికే అంకితం: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
ఈ సందర్భంగా, బిహార్లో విజయానికి కృషి చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అభివృద్ధి, పారదర్శక పాలనకు ప్రజలు ఇచ్చిన అపూర్వ మద్దతే ఈ ఎన్నికల ఫలితాలకు కారణమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ విజేతకు శుభాకాంక్షలు
బిహార్ ఫలితాల విషయం పక్కన పెడితే, తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉపఎన్నికలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆయన అభినందనలు తెలియజేశారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై నమ్మకం
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా బిహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా నెలకొంటున్న రాజకీయ ప్రవాహానికి అద్దం పట్టిందని, ప్రధాని నరేంద్ర మోదీ పట్ల పెరుగుతున్న ప్రజాదరణ ఈ ఫలితాల్లో స్పష్టంగా కనబడుతోందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి బిహార్ ప్రజలు కూడా బలంగా మద్దతు ఇచ్చారని సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు.

