Nara Lokesh

Nara Lokesh: ‘సీబీఎన్ అంటే డీఎస్సీ, డీఎస్సీ అంటే సీబీఎన్’: లోకేశ్ ప్రశంసలు

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జీవితకాల గురువు అని, ఆయన నాయకత్వంలో విద్యా వ్యవస్థను ప్రపంచానికి ఆదర్శంగా మారుస్తామని ఆయన అన్నారు. వెలగపూడిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా పాల్గొన్నారు.

డీఎస్సీపై తొలి సంతకం, సమిష్టి కృషికి నిదర్శనం :
యువగళం పాదయాత్రలో తాను నిరుద్యోగ యువతను కలిసినప్పుడు, అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చానని నారా లోకేశ్ గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం, కేవలం 150 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేశామని, దీని కోసం 150 కేసులు ఎదుర్కోవాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదని అన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న తమ లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. ‘సీబీఎన్ అంటే డీఎస్సీ, డీఎస్సీ అంటే సీబీఎన్’ అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరిగిన 15 డీఎస్సీలలో 14 తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయని, తమ ప్రభుత్వం ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా టీచర్లను నియమించిందని లోకేశ్ వివరించారు. ఈ మెగా డీఎస్సీ విజయం అందరి సమిష్టి కృషి ఫలితమని ఆయన పేర్కొన్నారు.

Also Read: Jagapati Babu: సాహితి ఇన్‌ఫ్రా కేసులో ఈడీ విచారణకు హాజరైన జగపతిబాబు

గురువుల నుంచి నేర్చుకున్న పాఠాలు..
తాను విద్యార్థిగా ఉన్నప్పుడు నామమాత్రంగా చదివేవాడినని, తన జీవితంలో ముగ్గురు గురువుల నుంచి స్ఫూర్తి పొందానని నారా లోకేశ్ తెలిపారు. పదో తరగతిలో ఫండమెంటల్స్‌లో చురుగ్గా లేనప్పుడు నారాయణ పాఠాలు చెప్పారని, అమెరికాలో ప్రొఫెసర్ రాజిరెడ్డి విద్యా వ్యవస్థ గురించి తనకు వివరించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ముగ్గురితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు జీవితకాల గురువు అని, ఆయన నుంచి పాలనలో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని అన్నారు. దేశానికి అధినేత అయినా గురువు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిందేనని ఆయన హితవు పలికారు.

భవిష్యత్తు ప్రణాళికలు
తమ ప్రభుత్వం ఏటా డీఎస్సీని నిర్వహిస్తుందని లోకేశ్ ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్‌లో మరోసారి టెట్ (TET) పరీక్ష నిర్వహిస్తామని, ఆ తర్వాత వచ్చే ఏడాది మళ్లీ డీఎస్సీని నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి, ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్‌ను ప్రపంచానికి చూపిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఫిన్లాండ్, సింగపూర్ వంటి దేశాల విద్యా వ్యవస్థలను అధ్యయనం చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *