Nara Lokesh: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను, పార్టీ అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన పిలిపించుకుని మాట్లాడారు.
శేషగిరిరావు పోరాటం స్ఫూర్తిదాయకం:
మాచర్ల నియోజకవర్గం, పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో నంబూరి శేషగిరిరావు చూపించిన ధైర్యం, ఆయన చేసిన పోరాటం ప్రతి టీడీపీ కార్యకర్తకు స్ఫూర్తిగా నిలుస్తుందని నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు.
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుంటే, నంబూరి శేషగిరిరావు ఎదురు తిరిగి పోరాడిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. అటువంటి ధైర్యవంతుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు.
కుటుంబ బాధ్యత నాది:
నంబూరి శేషగిరిరావు మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన నారా లోకేశ్.. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా, ఆ కుటుంబానికి సంబంధించిన బాధ్యతను వ్యక్తిగతంగా తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడం టీడీపీ సంస్కృతి అని, పార్టీ కోసం పోరాడిన వారి త్యాగాలు వృథా కావని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.