ముంబై: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ పార్టీలోని అతివిశ్వాసమే కారణమని ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన శివసేన(యుబిటి) అభిప్రాయపడింది. తాను బలహీనంగా ఉన్న చోట తన మిత్రపక్షాలపై ఆధారపడే కాంగ్రెస్ తాను బలంగా ఉన్న ప్రాంతాలలో మాత్రం తన మిత్రులను విస్మరిస్తుందని శివసేన(యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ ఆరోపించారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతో కలసి పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరే విధంగా ఉండేవని అన్నారు. తాను బలహీనంగా ఉన్న ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీల సాయాన్ని తీసుకునే కాంగ్రెస్ పార్టీ తాను బలంగా ఉన్న ప్రాంతాలలో మాత్రం ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వదని ఆయన చెప్పారు. బిజెపి వరుసగా మూడవసారి గెలుపొందిన హర్యానా ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఏమాత్రం ఉండబోదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలని ఆయన మరోసారి మహా వికాస్ అఘాడి(ఎంవిఎ)కి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షం తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లాను చూపించడం వల్లే జమ్మూ కశ్మీరు ఎన్నికల్లో ఎన్‌సి-కాంగ్రెస్ కూటమి గెలుపొందిందని ఆయన వాదించారు. హర్యానా ఎన్నికల ఫలితాలను దురదృష్టకరంగా రౌత్ అభివర్ణిస్తూ జమ్మూ కశ్మీరు ఎన్నికల్లో గెలిచింది ఇండియా కూటమని ఆయన స్పష్టం చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా కూటమి పోటీ చేసి ఉంటే, సమాజ్‌వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన(యుబిటి)కి సీట్లు కేటాయించి ఉంటే తమ కూటమి గెలిచి ఉండేదని, అయితే ఏకపక్షంగా పోటీ చేసి సొంతంగా గెలవాలని కాంగ్రెస్ భావించిందని ఆయన వ్యాఖ్యానించారు.