Montha Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను మరింత బలపడింది. ఇది ప్రస్తుతం నైరుతి–పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, ఈ తుఫాను మంగళవారం (అక్టోబర్ 28) రాత్రికి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీప తీరాన్ని దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం మొంథా తుఫాను చెన్నైకి 600 కి.మీ., కాకినాడకు 680 కి.మీ., వైజాగ్‌కు 710 కి.మీ. దూరంలో ఉంది. గంటకు 13–18 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90–110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుఫాను ప్రభావంతో ఏపీ రాష్ట్రంలోని కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, చిత్తూరు వంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 27 నుంచి 29 వరకు ఈ జిల్లాల్లో నిరంతర వర్షాలు కొనసాగవచ్చని సూచించారు.
ఇది కూడా చదవండి: ChatGPT: అప్ మార్చకుండా సరుకులు కొని ప్రెమెంట్స్ చేయొచ్చు..చాట్ జీపీటీలో కొత్త ఫీచర్
మొంథా తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైనా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలైన భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, కొమురంభీం, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో పాఠశాలలకు 4 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని, ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని అధికారులు సూచించారు.
మొంథా తుఫాను ప్రభావం కారణంగా రాబోయే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి. తుఫాను తీవ్రతను బట్టి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టేందుకు కంట్రోల్ రూమ్‌లు, ఎమర్జెన్సీ టీములు సిద్ధంగా ఉన్నాయి.

