Cockroaches: బొద్దింకలు కేవలం చిరాకు కలిగించడమే కాదు, ఇవి ఆహార పదార్థాలు, వంట సామాగ్రిపై తిరుగుతూ ఇ-కోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను వ్యాపింపజేసి అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తాయి. సాధారణంగా వీటిని నివారించడానికి రసాయన స్ప్రేలు వాడుతుంటారు, కానీ అవి మన ఆరోగ్యానికి హానికరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొన్ని సహజ పద్ధతులు, సరళమైన చిట్కాలతో వీటిని సులభంగా ఇంటి నుండి తరిమికొట్టవచ్చని వారు సూచిస్తున్నారు.
బొద్దింకలు రాకుండా ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి?
బొద్దింకలు ఇతర కీటకాల సమస్యలు లేకుండా ఉండాలంటే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బొద్దింకలు తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వేగంగా వృద్ధి చెందుతాయి. అందుకే:
పొడి ప్రదేశాలు: కప్‌బోర్డులు, కిచెన్‌లోని సింకు చుట్టూ, బాత్రూమ్‌లలో తేమ లేకుండా పొడిగా ఉండేలా చూసుకోండి.
రోజువారీ శుభ్రత: రోజూ ఈ ప్రదేశాలను శుభ్రం చేయండి.
అహార నియమాలు: తిన్న వెంటనే ప్లేట్లను శుభ్రం చేయండి. ఆహారం మిగిలిపోతే, వెంటనే మూత ఉన్న డబ్బాల్లో పెట్టండి లేదా బయట పారవేయండి. ఆహార వ్యర్థాలు ఎక్కడా పేరుకుపోకుండా చూసుకోండి.
అట్టపెట్టెల తొలగింపు: బొద్దింకలకు అట్టపెట్టెలు మంచి ఆహారం. అందువల్ల, అవసరం లేని అట్టపెట్టెలను ఇంట్లో ఉంచకుండా తొలగించండి.
తలుపులు, కిటికీలు: బొద్దింకలు లోపలికి రాకుండా ఉండేందుకు రాత్రి వేళల్లో లేదా అవసరం లేనప్పుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచండి.
చెత్త నిర్వహణ: చెత్త డబ్బాలకు ఎప్పుడూ గట్టిగా మూత పెట్టండి. రాత్రి పడుకునే ముందు చెత్త డబ్బాను ఇంటి బయట ఉంచడానికి ప్రయత్నించండి.
డిష్‌వాషర్‌లు: డిష్‌వాషర్‌లు బొద్దింకలు ఇంట్లోకి ప్రవేశించే మార్గాలలో ఒకటి. అందుకే రాత్రి వేళల్లో డిష్‌వాషర్‌లను మూసి ఉంచండి.
బొద్దింకలను తరిమికొట్టే సహజసిద్ధమైన చిట్కాలు:
దాల్చినచెక్క: దాల్చినచెక్క ఘాటైన వాసన బొద్దింకలకు పడదు. దాల్చినచెక్క పొడిని కొద్దిగా ఉప్పులో కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో చల్లితే, అవి రాకుండా ఉంటాయి. ఇది బొద్దింకలతో పాటు వాటి గుడ్లను కూడా నాశనం చేయడంలో సహాయపడుతుంది.
Also Read: Health Benefits Of Walnuts: వాల్‌నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే…
ఉల్లిపాయలు: ఉల్లిపాయల నుండి వచ్చే ఘాటైన వాసన బొద్దింకలను దూరంగా ఉంచుతుంది. ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఉల్లిపాయ రసాన్ని స్ప్రే చేయడం వల్ల అవి అక్కడి నుండి పారిపోతాయి.
లవంగాలు: లవంగాలు కూడా బొద్దింకల నివారణకు చాలా బాగా పనిచేస్తాయి. బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో కొన్ని లవంగాలను ఉంచితే సరిపోతుంది. 2009లో “జర్నల్ ఆఫ్ ఎంటమాలజీ అండ్ జూవాలజీ” లో ప్రచురితమైన ఒక అధ్యయనం లవంగాల నూనె బొద్దింకలను దూరంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొంది. ఇరాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎం.హెచ్. మోషాంగ్ ఈ రీసెర్చ్‌లో పాల్గొన్నారు.
బేకింగ్ సోడా, చక్కెర: బేకింగ్ సోడా, చక్కెరను సమాన నిష్పత్తిలో కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లండి. బొద్దింకలు ఈ మిశ్రమాన్ని తిన్న వెంటనే చనిపోతాయని నిపుణులు చెబుతున్నారు. చనిపోయిన వాటిని తొలగిస్తే బొద్దింకల బెడద తగ్గుతుంది.
ఈ చిట్కాలు పాటించడం ద్వారా రసాయన స్ప్రేల అవసరం లేకుండానే బొద్దింకల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఈ సహజ నివారణలను ఉపయోగించడం వల్ల మీ ఇల్లు బొద్దింకలు లేని సురక్షితమైన ప్రదేశంగా మారుతుంది.