Manchu manoj: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద జరిగిన హైడ్రామా అందరిలోనూ ఆసక్తి రేపింది. యూనివర్శిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మంచు మనోజ్‌ను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. కోర్టు ఆదేశాల ప్రకారం యూనివర్శిటీలోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఘటనలో మోహన్ బాబు బౌన్సర్లకు, మంచు మనోజ్ బౌన్సర్లకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడులు, చేతులాదిపడులు జరిగాయి. ఈ సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ, తాతా-నానమ్మ సమాధులకు దండం పెట్టేందుకు మాత్రమే వచ్చానని, గొడవలకు తనమాత్రం ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల కోసం ప్రశ్నించినందుకే తనను యూనివర్శిటీలోకి అనుమతించలేదని, ఇది అన్యాయమని ఆరోపించారు.
తన తల్లిని బ్రెయిన్‌వాష్ చేసి, పత్రాలపై సంతకాలు చేయించారని మనోజ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమెకు అసలు విషయం తెలియకుండానే ఆ పని చేయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వస్తున్న విషయం తెలిసి ఢిల్లీ నుంచి బౌన్సర్లను రప్పించారని, ఇది పన్నిన కుట్రగా అభివర్ణించారు. తానొక్కడినే చాలని, ప్రతి ఒక్కరినీ ఎదుర్కొంటానని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తర్వాత, ఈ సాయంత్రం పోలీసులు యూనివర్శిటీలోకి మనోజ్‌ను అనుమతించారు. ఆయన తన భార్య మౌనికతో కలిసి తాతా-నానమ్మ సమాధులకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

