Liquor Shop Tender: సంగారెడ్డి: మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అదృష్టం ఒకరిని వరించింది. సంగారెడ్డి జిల్లాలో ఏకంగా 100కు పైగా దరఖాస్తులు సమర్పించిన ఒక వ్యక్తికి ఏకంగా మూడు వైన్ షాపుల లైసెన్సులు దక్కాయి.
సోమవారం (అక్టోబర్ 27, 2025) సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్ల డ్రాలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే, కే. వంశీధర్ రెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులు హరీష్, మురళీతో కలిసి జిల్లాలో 100కి పైగా దరఖాస్తులు సమర్పించారు.
ఇది కూడా చదవండి: Delhi Acid Attack: కూతురితో తండ్రి ప్లాన్.. రేప్ కేసు పెట్టిన నిందితుడి భార్య
ఈ డ్రాలో వంశీధర్ రెడ్డికి పటాన్చెరు ప్రాంతంలో మూడు మద్యం దుకాణాల లైసెన్సులు (షాపు నంబర్లు 32, 34, 40) దక్కాయి. ఈ ముగ్గురు మిత్రులు కలిసి దరఖాస్తులు వేసినప్పటికీ, గెలుచుకున్న మూడు దుకాణాలు వంశీధర్ రెడ్డి పేరు మీద రిజిస్టర్ కావడం గమనార్హం.
జిల్లాలో అత్యధిక మద్యం అమ్మకాలు నమోదయ్యే ప్రాంతాల్లో పటాన్చెరు ఒకటి కావడంతో, మూడు లైసెన్సులు దక్కించుకున్న ఈ ముగ్గురు మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. వారి ఉమ్మడి కృషి ఫలించి, ఒకే వ్యక్తి పేరుపై మూడు లైసెన్సులు పొందడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

