Mahesh kumar goud: బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుపట్టారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేమే ప్రారంభించాం. ఆ సమయంలో కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఆమె బీసీ రిజర్వేషన్ల కోసం ఎప్పుడు పోరాడారు? ఇప్పుడు రిజర్వేషన్లపై విజయం తమదని చెప్పడం హాస్యాస్పదం,” అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులసర్వే, బీసీలకు 42% రిజర్వేషన్ల నిర్ణయాలను విప్లవాత్మకంగా అభివర్ణించారు. “ఇది తెలంగాణలో సామాజిక న్యాయానికి దారితీసే చారిత్రక నిర్ణయం. కానీ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగింది,” అని విమర్శించారు.
అలాగే, “కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నార ఆమెకే స్పష్టత లేకపోయే పరిస్థితి. ఆమె మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు వినగానే నవ్వుకుంటున్నారు,” అని ఎద్దేవా చేశారు. బీసీలకు మేలు కలిగించే అంశంలోనైనా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పందించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. “ఇలాంటి గొప్ప నిర్ణయాన్ని కూడా ప్రశంసించలేకపోతే అది వారి రాజకీయ అసహనానికే నిదర్శనం,” అని గౌడ్ విమర్శించారు.
బీజేపీపై కూడా గౌడ్ విమర్శలు గుప్పించారు. “బీసీల పట్ల బీజేపీకి నిజమైన చిత్తశుద్ధి లేదు. రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. మౌనం వీరికి అసలైన నైజాన్ని చాటుతోంది,” అని అన్నారు.