YCP Digital Scam

YCP Digital Scam: ఆ పార్టీతో అంటకాగితే..’అంతే’నా?

YCP Digital Scam: వైసీపీ వంటి పార్టీలతో అంటకాగితే.. ఏ రంగంలో వారికైనా ఇబ్బందులు తప్పవా? డిజిటల్‌ కార్పొరేషన్‌ ద్వారా రెమ్యునరేషన్‌ తీసుకున్న ముమ్ముట్టి ఇప్పుడు ఎలాంటి లీగల్‌ సమస్యలను ఫేస్‌ చేయబోతున్నారు? మహీ వి రాఘవ.. తన యాత్ర సినిమాని కేవలం కమర్షియల్‌ కోణంలోనే తీశాననీ, ఇందులో రాజకీయ కోణం లేదనీ, రాజకీయ ప్రేరేపితమై చేసింది కాదని బాగానే కవర్‌ చేశారు అప్పట్లో. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక మహీ వి రాఘవ పొందిన లబ్దితో.. ఆయనో ఫక్తు వైసీపీ దర్శకుడు అని తేలిపోయింది. తాను ఇరుక్కోవడమే కాకుండా, సూపర్‌ స్టార్‌ ముమ్ముట్టిని కూడా ఇరికించినట్లు అర్థం అవుతోంది. ఇప్పుడు ఈ డిజిటల్ స్కామ్‌పై కూటమి ప్రభుత్వం చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరెవరు కేసు ఎదుర్కోబోతున్నారు? విచారణ ఎలా ఉండబోతోంది? స్కామ్‌లో ఇంకా తేలాల్సిన అంశాలేంటి? టేక్‌ ఎ లుక్‌.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ హయాంలో జరిగిన డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రజల సొమ్మును పంచదారలా చేసుకుని తిన్న ఈ కుంభకోణం వెనుక దాగిన కుమ్మక్కు కథలు ఒక్కొక్కటిగా విజిలెన్స్ విచారణలో బయటపడుతున్నాయి. వైసీపీ లాంటి పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఇబ్బందుల్లో పడక తప్పదని ఈ స్కామ్ స్పష్టం చేస్తోంది. సూపర్‌స్టార్ మమ్ముట్టి నుంచి దర్శకుడు మహి వి రాఘవ్ వరకు, పార్టీ కార్యకర్తల నుంచి డిజిటల్ మీడియా నిర్వాహకుల వరకు.. ఈ కుంభకోణం విస్తరించినట్లు తెలుస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌ను తమ సొంత గుప్పిట్లో పెట్టుకుంది. ఈ కార్పొరేషన్‌కు జగన్ హయాంలో రూ.171.9 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారు. కానీ, విజిలెన్స్ 72 పేజీల నివేదిక ప్రకారం, అందులో రూ.37.20 కోట్లు దుర్వినియోగమయ్యాయి. ప్రభుత్వ వీడియోలు తీశామనే పేరుతో కోట్లాది రూపాయలు డ్రా చేసి, ఆ నిధులను వైసీపీ అనుకూల సినిమాలు, కార్యకర్తల జీతాలు, డిజిటల్ మీడియా దాడులకు మళ్లించారు.

ఇది కూడా చదవండి: Nara Lokesh: లోకేష్‌ మాస్‌ స్పీచ్

‘యాత్ర 2’ సినిమాకు డిజిటల్ కార్పొరేషన్‌కు సంబంధం లేదని చెప్పినా, ఆ సినిమాలో నటించిన మమ్ముట్టికి రూ.50 లక్షలు ఈ కార్పొరేషన్ నుంచే చెల్లించారని విజిలెన్స్‌ విచారణలో తేలింది. ఇది నిజమైతే, మమ్ముట్టి లీగల్ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సాక్ష్యాలు బలంగా ఉంటే, ఆయన విచారణ ఎదుర్కోక తప్పదు. వైసీపీ అనుకూల ప్రచార చిత్రంగా రూపొందిన ‘యాత్ర’ సినిమాలకు ఈ నిధులు వెళ్లాయన్న ఆరోపణలు మమ్ముట్టిని కూడా చిక్కుల్లోకి నెట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ALSO READ  Mahaa Vamsi: ఢిల్లీలో రేవంత్ గర్జన..కంగారు పెట్టించిన కొండా..

‘యాత్ర’ సినిమాను కమర్షియల్ కోణంలోనే తీశానని, రాజకీయ ప్రేరణ లేదని మహి వి రాఘవ్ గట్టిగా కవర్ చేసుకున్నా, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు లభించిన లబ్ధి.. ముసుగు తొలగించి ఆయన వైసీపీ దర్శకుడేనని తేల్చేసింది. డిజిటల్ కార్పొరేషన్ నిధులతో ‘యాత్ర 2’కి డబ్బు మళ్లించడంతో పాటు, హార్సిలీ హిల్స్‌లో స్టూడియో పేరుతో స్థలం కొట్టేసేందుకు ప్లాన్ వేశారన్నది ఇది వరకే బట్టబయలైంది. ఇప్పుడు మహి కూడా విచారణ ఊబిలో చిక్కుకున్నట్లే.

డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్‌గా చిన్న వాసుదేవరెడ్డిని నియమించినప్పటి నుంచి ఈ స్కామ్ ఊపందుకున్నట్లు విజిలెన్స్‌ విచారణలో తేలినట్లు సమాచారం. తన సొంత డిజిటల్ మీడియా సంస్థకు రూ.37.20 కోట్లు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన కనుసన్నల్లోనే ఈ దందా నడిచిందని, ఇప్పుడు సీఐడీ, విజిలెన్స్ సిఫారసులతో కేసులు ఖాయమని తెలుస్తోంది. అరెస్టులు కూడా తప్పవని సమాచారం.

కూటమి ప్రభుత్వం ఈ స్కామ్‌పై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా చిన్న వాసుదేవరెడ్డి, మహి వి రాఘవ్, మమ్ముట్టితో పాటు.. హైకోర్టు జడ్జిలను తిట్టిన కేసుల్లో జైలుకెళ్లిన సుమ తియ్యగుర వంటి వారిపైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వారిని కూడా ఈ డిజిటల్‌ కార్పొరేషన్‌ నిధులతోనే పెంచి పోషించారు. ఇక, నిధుల దారి మళ్లింపు వివరాలపై ప్రభుత్వం క్షుణ్ణంగా ఆరా తీస్తోంది. ఎంత మంది లబ్ధి పొందారనేది ఇంకా లెక్క తేలాల్సి ఉంది.

అధికారం శాశ్వతం అని భావించే, 30 ఏళ్లు తమదే ఇష్టారాజ్యం అనుకునే, అవినీతి మరకలున్న పార్టీలతో జత కట్టిన వారికి ఎప్పటికైనా లీగల్‌గా, పొలిటికల్‌గా ఇబ్బందులు తప్పవని చెప్పేందుకు ఈ స్కామ్ ఒక్కటే చాలంటున్నారు పొలిటికల్‌ పండితులు. మమ్ముట్టి వంటి స్టార్‌లను కూడా ఇరికించిన ఈ కుంభకోణం వైసీపీ పాలనలోని అవినీతి లోతుల్ని బయటపెడుతోంది. విచారణ ముమ్మరమైతే, ఇంకా ఎన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *