Mahaa Conclave On Education: అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం KGBV పాఠశాల ప్రస్తుతం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్న నెగెటివ్ అభిప్రాయాలను తుడిచిపెట్టేస్తూ, ఈ పాఠశాల ఒక మోడల్ గా నిలుస్తోంది.
“జీరో ఇన్వెస్ట్‌మెంట్ – 100% సంతృప్తి” స్కూల్
ఈ పాఠశాల ప్రత్యేకతేంటంటే… ఇక్కడ తల్లిదండ్రులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. స్కూల్‌లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ నాగమణి గారు మాట్లాడుతూ.. “తల్లిదండ్రులకు ఖర్చు లేకుండా, పిల్లలకు ఉత్తమమైన ఫలితాలు, పూర్తి సంతృప్తి, భద్రత కల్పించడం మా లక్ష్యం.”
ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, వాస్తవంగా 100% ఫలితాలు సాధిస్తూ నానాటికీ గుర్తింపు పొందుతోంది అని అన్నారు.
అడ్మిషన్లకు అధిక డిమాండ్
ఈ పాఠశాలలో అడ్మిషన్ల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. దీంతో తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను ఇక్కడ చేరుస్తున్నారు. స్కూల్‌లోని విద్యా ప్రమాణాలు, భద్రతా సౌకర్యాలు, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం వల్లే ఈ స్థాయికి చేరింది.
విద్యార్థుల ఆనందమైన అనుభవాలు
ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా ఎంతో సంతోషంగా చెప్పుకుంటున్నారు. “ఇక్కడ టీచర్లు బాగా బోధిస్తారు. అన్నం రుచిగా ఉంటుంది. మాకు అన్ని సౌకర్యాలు ఇస్తారు” అంటూ వారు తమ అనుభవాలు మహా న్యూస్ తో పంచుకుంటున్నారు.
“తల్లి వందనం” పథకం ప్రభావం
ఈ వీడియోలో ఎం. నాగవల్లిక అనే విద్యార్థిని మాట్లాడుతూ..”తల్లి వందనం” పథకం మా కుటుంబానికి ఎంతో ఉపయోగపడింది. మా అక్కా చెల్లెళ్ళకు కూడా ఈ స్కీమ్‌తో మంచి ప్రయోజనం జరిగింది. వాళ్ల చదువుకోసం వచ్చిన డబ్బును భవిష్యత్ అవసరాలకు పెట్టుబడిగా వాడుతున్నాం” అని తెలిపింది. దీనివల్ల ప్రభుత్వ పథకాలు ఎలా ఉపయోగకరంగా మారుతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది.
ఉదాహరణగా నిలుస్తున్న ప్రభుత్వ స్కూల్
ఇప్పుడీ బుక్కరాయ సముద్రం KGBV పాఠశాల, “మా పిల్లల భవిష్యత్‌కి ఇదే సరైన స్కూల్” అని చెప్పుకునేలా తయారైంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉన్నత స్థాయి విద్య అందుతుందని నిరూపిస్తోంది.