Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. రోజూ కోటి మందికి అటూ ఇటుగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. రేపు అంటే జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నది. సరిగ్గా ఇలాంటి రోజే 70 ఏండ్ల క్రితం ఓ విషాద ఘటన చోటుచేసుకున్నది.
Maha Kumbh Mela 2025: ఈ నెల 13న మహా కుంభమేళా ప్రారంభమైంది. ఈ కుంభమేళాలో ఈ నెల 27వ తేదీ నాటికి 15 రోజులు అవుతుంది. ఆయా రోజుల్లో సుమారు 14 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 27న ఒక్కరోజే 1.5 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపింది. ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.
Maha Kumbh Mela 2025: 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళాకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హిందువులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విదేశాల్లోని హిందువులతోపాటు ఇతర మతస్తులు కూడా దర్శించుకోవడం గమనార్హం. రాక్షసులపై దేవతలు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు.
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ఎంతో మంది రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. బాలీవుడ్‌లో పేరొందిన కొరియోగ్రాఫర్, క్రైస్తవ మతంలోకి మారిన రెమో డీసౌజా కూడా రహస్యంగా కుంభమేళాకు వచ్చి పవిత్రస్నానం ఆచరించారని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
29న మౌని అమావాస్య
Maha Kumbh Mela 2025: ఈ నెల 29న మౌని అమావాస్య రోజు కుంభమేళాలో పుణ్యస్నానమాచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నది. ఈ రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. ఇదేరోజు అఘోరాలు, నాగ సాధువులు కూడా లేక్కలేనంత మంది గుంపులుగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. సెలబ్రిటీలు కూడా ఇదేరోజు త్రివేణి సంగమంలో స్నానమాచరించడానికి ప్లాన్ చేసుకుంటారు.
70 ఏండ్ల క్రితం ఏం జరిగిందంటే..
Maha Kumbh Mela 2025: 1954 ఫిబ్రవరి 3న మౌని అమావాస్య సందర్భంగా అసంఖ్యాకంగా భక్తులు, నాగ సాధువులు, అఘోరాలు పోటెత్తారు. స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళా కావడంతో లక్షల్లో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సుమారు 800 మంది మృత్యువాతపడ్డారు. సుమారు 2000 మందికిపైగా గాయాలపాలయ్యారు.