Maha Kumbh Mela 2025: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో 17వ రోజున అపశృతి చోటుచేసుకున్నది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమం సెక్టార్ 2 వద్ద భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి పోయాయి. ఈ సమయంలో భక్తుల తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత పడగా, సుమారు 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.
Maha Kumbh Mela 2025: మౌని అమావాస్యను పురస్కరించుకొని మూడో అమృత స్నానం కోసం పెద్ద సంఖ్యలో ప్రయాగరాజ్‌కు భక్తులు తరలిరావడంతో బుధవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఈ తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి మృతదేహాలను, క్షతగాత్రులైన వారిని స్థానిక స్వరూప్‌రాణి ఆసుపత్రికి తరలించారు.
Maha Kumbh Mela 2025: తొక్కిసలాట ఘటనతో అఖిల భారత అఖాడా పరిషత్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకున్నది. అమృత స్నానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాగరాజ్ కేంద్రంగా పనిచేసే ఈ అఖాడా పరిషత్.. దేశవ్యాప్తంగా ధార్మిక సేవా కార్యక్రమాలు చేపడుతుంది. ఫిబ్రవరి 3న అమృతస్నానం ఆచరిస్తామని ప్రకటించింది. స్నానానికి మేము వెళ్లడం లేదు.. స్నానాన్ని రద్దు చేసుకున్నాం.. పరిషత్ పెద్దలు చెప్పారు.
70 ఏండ్ల తర్వాత తొక్కిసలాట ఘటన పునరావృతం
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాలో 70 ఏండ్ల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటన మళ్లీ పునరావృతం అయింది. అంత తీవ్రత లేకున్నా అలాంటి ఘటనే చోటుచేసుకున్నది. 1954 ఫిబ్రవరి 3న మౌని అమావాస్య సందర్భంగా అసంఖ్యాకంగా భక్తులు, నాగ సాధువులు, అఘోరాలు పుణ్యస్నానాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి సుమారు 800 మంది మృత్యువాతపడ్డారు. సుమారు 2000 మందికి పైగా గాయపడ్డారు. మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకోవడం విపరిణామమే. ప్రస్తుతం 20 మంది భక్తులు చనిపోవడం, మరో 100 మందికి గాయాలు కావడం విషాదం నింపింది.