Rain Alert: బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడింది. శ్రీలంక దగ్గర, నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. తీర ప్రాంతాలలో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా, సోమవారం వరకు మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఎలా ఉంటాయంటే:
* సోమవారం (నవంబర్ 17, 2025): నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
* మంగళవారం (నవంబర్ 18, 2025): నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది.
ఇంతటితో ఆగకుండా… మరో హెచ్చరిక!
నవంబర్ 21వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావం నవంబర్ 24 నుంచి 27వ తేదీ వరకు కోస్తా మరియు రాయలసీమ జిల్లాలపై పడుతుందని, ఆ సమయంలో మరిన్ని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి రైతన్నలు తమ వ్యవసాయ పనుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

