Basketball: రంగం ఏదైనా .. పట్టుదల, ఉత్సాహం, లక్ష్యం ఉండాలే కానీ.. వయసుతో సంబంధం లేకుండా తమ లక్ష్యాలను సాధించడం పెద్ద కష్టం కాదని చాలా మంది నిరూపించారు. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని చూపించారు. క్రీడారంగంలో అయితే ఇలాంటి వారిని మనం అరుదుగా చూస్తూ ఉంటాం. ఆలాంటి ఒక ప్లేయరే లెబ్రాన్ జేమ్స్. ఇంతకీ ఈ దిగ్గజ ఆటగాడు ఇప్పుడు కొత్తగా సాధించిన ఘనత ఏంటో చూద్దాం..!
సాధారణంగా క్రీడల్లో 35 ఏళ్లు దాటిన తర్వాత ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. అయితే, కొంత మంది మాత్రం 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆడుతూ అభిమానులను అలరించడంతో పాటు ఆశ్చర్యపరుస్తుంటారు. పలు రికార్డులు సాధిస్తుంటారు. తాజాగా ఒక స్టార్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా ఈ 40 ఏళ్ల వయసులో సూపర్ రికార్డు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అమెరికా బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ తన కెరీర్‌లో మరో అద్భుతమైన ఘనత సాధించాడు. ఈ వయసులో ఒక రికార్డును సృష్టించి చరిత్రలో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఎన్‌బీఏలో లాస్ ఏంజెలెస్ లాకర్స్ తరఫున లెబ్రాన్ ఆడుతున్నాడు. తాజాగా అతడు 42 పాయింట్లు సాధించి కొత్త రికార్డు సృష్టించాడు. ఎన్‌బీఏ గేమ్‌లో 40 ఏళ్లు దాటిన తర్వాత 40 పాయింట్లకు పైగా స్కోర్ చేసిన అతి పెద్ద వయసున్న ఆటగాడిగా నిలిచాడు. మైకేల్ జోర్డాన్ తర్వాత నలభై ఏళ్ల వయసులో ఈ ఘనతను సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
జోర్డాన్ 40 ఏళ్ల 4 రోజుల వయసులో 43 పాయింట్లు సాధించాడు. 2003లో వాషింగ్టన్ విజార్డ్స్ తరఫున ఆడుతూ ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు లెబ్రాన్ 40 ఏళ్ల 38 రోజుల వయసులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇన్నేళ్ల తర్వాత తన గురువు అయిన జోర్డాన్ రికార్డుకు చేరుకున్నాడు.
లెబ్రాన్ అద్భుతమైన ప్రదర్శనతో లాస్ ఏంజెలెస్ లాకర్స్ 120-112 తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని సాధించింది. గోల్డెన్ స్టేట్ వారియర్స్‌ను ఉత్కంఠ పోరులో ఓడించి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన లెబ్రాన్ గురించే ప్రస్తుతం బాస్కెట్ బాల్ ప్రపంచం అంతా చర్చించుకుంటోంది.