Kurnool: కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రం మంత్రాలయం మరోసారి విషాదానికి వేదికైంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వచ్చిన ముగ్గురు యువకులు తుంగభద్ర నదిలో స్నానం చేస్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతులను కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన ప్రమోద్ (20), అజిత్ (19), సచిన్ (20)గా గుర్తించారు.
మంత్రాలయానికి చేరుకున్న ఈ యువకులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్లారు. అయితే, ప్రస్తుతం నదిలో నీటి మట్టం పెరగడంతో పాటు ప్రవాహం కూడా గతంలో కంటే ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని గ్రహించకుండా లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. యువకులు మునిగిపోవడాన్ని చూసిన అక్కడున్న స్థానికులు, గజ ఈతగాళ్లు వెంటనే అప్రమత్తమై రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు.