KTR: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడే కొన్ని మాటలను ఇక నుంచైనా బంద్ చేయాలని హితవు పలికారు. అలాంటి మాటల వలన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి మంచిది కాదని చెప్పారు. కేసీఆర్ గురించి మీ ప్రభుత్వం ఇచ్చిన కీలక నివేదికను చదువుకొని మాట్లాడాలని రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సూచించారు.
KTR: హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మీడియా సమావేశంలో కేటీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దౌర్భాగ్యమైనదని దుమ్మెత్తిపోశారు. మీ ఉప ముఖ్యమంత్రి ఇటీవల ఇచ్చిన అట్లాస్ నివేదికను చదువుకోవాలని కోరారు. దానిలోనే కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గణాంకాలతో సహా ఉన్నదని, దానిలోనే కేసీఆర్‌ను పొగిడినట్టు ఉన్నది తెలుసుకో అని చెప్పారు. గణాంక సర్వేలో కేసీఆర్‌ను పొగిడేసరికి, నొచ్చుకొని వెంటనే డిలీట్ చేయించారని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR: తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో 10వ స్థానంలో ఉంటే, ఒకటో స్థానంలో పెట్టి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత తెలంగాణను దివాలా తీయించి, దివాలాకోరు మాటలు మాట్లాడుతున్న సన్నాసులు నోరు మూపించేలా ఈ గణాంక సారాంశం ఉన్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
KTR: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే రెండు రెట్లు పెరిగిందని కేటీఆర్ వివరించారు. ఇప్పటికైనా కేసీఆర్‌ను తిట్టుడు, దుర్భాషలాడుడు, తెలంగాణకు శాపం పెట్టుడు బంద్ చెయ్ యాక్సిడెంటల్ సీఎం రేవంత్‌రెడ్డి.. అని కేటీఆర్ సూచించారు. తెలంగాణను ఎవరు తిట్టినా వాళ్లకు ఇలాగే సమాధానం చెప్తానని సూటిగా చెప్పారు. సిగ్గులేనివాళ్లే తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోలుస్తారని, ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రంగా మాట్లాడటం సిగ్గుచేటని కేటీఆర్ ధ్వజమెత్తారు. నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోబోమని రేవంత్‌రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు.