KTR: కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనొద్దు.. మా ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని తిరిగి తీసుకుంటాం.. ఇవీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్చరికలు. అద్భుతమైన పార్కుగా మార్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి కానుకగా ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.
KTR: ప్రభుత్వం వెనక్కి తగ్గి హెచ్‌సీయూ 400 ఎకరాల భూముల్లో చెట్ల నరికివేతను ఆపకపోతే తాము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం దిగిరాకుంటే హైదరాబాద్ నగర ప్రజలతో హెచ్‌సీయూకు మార్చ్ చేపడుతామని స్పష్టం చేశారు. ఇది హైదరాబాద్ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటంగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ప్రజలవి అని, ముఖ్యమంత్రి కేవలం ధర్మకర్త మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమియే అయితే దొడ్డిదారిని పనులు ఎందుకు చేయాలని ప్రశ్నించారు.
KTR: ఫ్యూచర్ సిటీ కోసం 14 వేల ఎకరాలు భూమి సిద్ధంగా ఉండగా, ఇక్కడ ఉన్న నగరాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. పశ్చిమ హైదరాబాద్‌లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ ఇది అని, దాన్ని ఎందుకు కరాబు చేస్తున్నారని నిలదీశారు. అక్కడ ఉండే జంతువులకు నోరు లేదని, మీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు నోర్లు ఏమయ్యాయి అంటూ ఘాటుగా స్పందించారు. హెచ్‌సీయూ జంతు ఘోష దేశమంతా వినపడుతుంది.. మీకు వినబడటం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
KTR: ఎక్కడెక్కడ నుంచో వచ్చిన హెచ్‌సీయూ విద్యార్థులకు హైదరాబాద్ మీద ఉన్న ప్రేమలో ఒక్క శాతం ప్రేమ కూడా మీకు లేదా రేవంత్‌రెడ్డి? అని ముఖ్యమంత్రిని కేటీఆర్ ప్రశ్నించారు. డబ్బు కోసం ఇంతగా దిగజారుతారా? అంటూ నిలదీశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అప్పుడప్పుడూ కేంద్రం ఇచ్చే నివేదికలను కూడా చదవాలని సూచించారు. ఆయన అవన్నీ చూడకుండా ఏదో చేస్తే ఎలా అని ప్రశ్నించారు.